న్యాయవాదులకు లా నేస్తం ఆర్థిక సాయం

Dec 11,2023 20:46

పార్వతీపురం : కొత్తగా లా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన యువ న్యాయవాదులు వృత్తిలో నిలదొక్కుకొని ఉన్నతంగా ఎదిగేలా ప్రభుత్వం లా నేస్తం పథకం కింద నెలకు రూ.5 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించి భరోసా కల్పిస్తుందని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోవిందరావు అన్నారు. సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తాడేపల్లి గూడెం క్యాంప్‌ కార్యాలయం నుంచి వైఎస్‌ఆర్‌ లా నేస్తం పథకం కింద బటన్‌ నొక్కి నేరుగా ఆర్థిక సాయాన్ని న్యాయవాదుల ఖాతాలకు విడుదల చేశారు. స్థానిక కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరం నుండి జిల్లా ఇంఛార్జి కలెక్టర్‌ ఆర్‌.గోవిందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవృత్తిలో ప్రాక్టీస్‌ పరంగా స్థిరపడేందుకు ఏడాదికి రూ.60 వేలు చొప్పున రెండుదఫాలుగా ప్రభుత్వం చెల్లిస్తూ మూడేళ్లకు రూ.1.80 లక్షల ఆర్థిక తోడ్పాటును అందిస్తుందన్నారు. జిల్లాలోని 12మంది న్యాయవాదులకు రూ.3.60 లక్షల సాయం అందజేస్తున్నట్లు తెలిపారు. అనంతరం జాయింట్‌ కలెక్టర్‌ చేతుల మీదుగా యువ న్యాయవాదులకు చెక్కును అందజేశారు. కార్యక్రమంలో డ్వామా ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ కె.రామచంద్ర రావు, న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు.

➡️