పోలీసు సేవలు మెరుగ్గా అందాలి : రాజన్నదొర

Dec 4,2023 21:10

భామిని : పోలీస్‌ సేవలు క్షేత్ర స్థాయిలో మెరుగ్గా అందాలని, మారు మూల గిరిజన ప్రాంతం, ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులో ఇటువంటి మోడల్‌ పోలీస్‌ స్టేషన్‌ నిర్మాణం చాలా ఆనందదాయకమని డిప్యూటీ సిఎం పీడిక రాజన్న దొర, ఎమ్మెల్యే కళావతి అన్నారు. మండలంలోని బత్తిలిలో రూ.4 కోట్లతో నిర్మించిన నూతన మోడల్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఆయన సోమవారం ప్రారంభించారు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌, విశాఖ రెంజీ డిఐజి హరికృష్ణ, ఎస్‌పి విక్రాంత్‌ పాటిల్‌, ఐటిడిఎ పిఒ కల్పనాకుమారి, డిఎస్‌పి జివి కృష్ణారావు, సిఐ మురళీదర్‌, ఎస్‌ఐ వై. అమ్మన్నారావు, ఎంపిపి తోట సింహాచలం, సర్పంచ్‌ టింగ శాంతికుమారి, వైస్‌ ఎంపిపి బోనగడ్డి ధర్మారావు, ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.దళిత, గిరిజనులకు భూ పట్టాలు పంపిణీ మండలంలోని అర్హులైన దళిత, గిరిజనులకు రాజన్నదొర పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని సుమారు వెయ్యి ఎకరాల ప్రభుత్వ భూమిని 1175 మందికి శాశ్వత హక్కు కల్పిస్తున్నామని, మీరు ఈ భూమిని అమ్ముకోరాదని సూచించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ భామినిలో డిగ్రీ కళాశాల ఏర్పాటు, ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌లు అంశాలు పరిశీలించి ఈ మండలం అభివద్ధికి సహకరించాలని మంత్రిని కోరారు. జిల్లాకు మారుమూల ఉన్న భామినిలో డిగ్రీ కాలేజీ, పెట్రోల్‌ బంక్‌, స్టేట్‌ బ్యాంకు, ఎటిఎం సెంటర్‌ ఏర్పాటయ్యేలా చొరవ చూపాలని రాష్ట్ర గిరిజన సంఘం ఉపాధ్యక్షులు బిడ్డికి తేజేశ్వరరావు తెలిపారు. మౌలిక వసతులు కల్పనకు ప్రాధాన్యత గుమ్మలక్ష్మీపురం: రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతంలో మారుమూల గిరిజన గ్రామాలకు రహదారులు, ఇతర మౌలిక వసతులు కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్న దొర అన్నారు. బత్తిలి పోలీస్‌ స్టేషన్‌ ప్రారంభోత్సవం సందర్భంగా మార్గమధ్యలో ఉన్న గుమ్మలక్ష్మీపురం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. గిరిశిఖర గ్రామాలకు రహదారులను పెద్ద ఎత్తున నిర్మిస్తున్నామని ఇందుకోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో, గురుకుల పాఠశాలలో విద్యా ప్రమాణాలు మెరుగుకు తగిన కృషి చేస్తున్నామన్నారు. నాడు నేడు కార్యక్రమంలో భాగంగా పలు పాఠశాల భవనాలను నిర్మించామని, విద్యార్థులకు కావాల్సిన ఫర్నీచర్‌ తదితర సౌకర్యాలను కల్పిస్తున్నామని చెప్పారు. అర్హులైన ప్రతి గిరిజన కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయనిగుర్తు చేశారు. గిరిజన ప్రాంతాల్లో వైద్య సౌకర్యాల మెరుగునకు సాలూరు, పార్వతీపురం, కురుపాం, భద్రగిరి తదితర ఆసుపత్రులను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని, అదనపు భవన నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. గిరిజనులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందడానికి తగిన పథకాలను తాము చేపడుతున్నామని చెప్పారు. రాజన్న దొర గుమ్మలక్ష్మీపురం వచ్చిన సందర్భంగా ఎల్విన్‌పేట ఎస్‌ఐ షణ్ముఖరావు బందోబస్తు ఏర్పాటు చేశారు.

➡️