ప్రశాంత ఎన్నికలకు ఒడిశా జిల్లా కలెక్టర్లతో సమన్వయ సమావేశం

Mar 21,2024 19:32

పార్వతీపురంరూరల్‌ : పార్వతీపురం మన్యం, రాయగడ, కోరాపుట్‌ జిల్లాల్లో సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా, సజావుగా నిర్వహణకు పరస్పరం సమన్వయంతో వ్యవహరించాలని నిర్ణయించారు. మూడు జిల్లాల కలెక్టర్లు, ఎస్‌పిలతో గురువారం సమన్వయ సమావేశం వీడియో కాన్ఫరెన్స్‌ విధానంలో జరిగింది. మన్యం జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్‌ కుమార్‌ ఈ సమావేశాన్ని సమన్వయపరిచారు. సజావుగా, నిష్పాక్షికమైన ఎన్నికలే లక్ష్యంగా కృషి చేయాలని అన్నారు. ఈ జిల్లాల్లో ఒకే దశలో ఎన్నికలు జరుగుతున్నాయని, ప్రత్యేకించి ఐడి మద్యం, మాదకద్రవ్యాలను అరికట్టడం, ఉచితాల పంపిణీని నియంత్రించడం, పోలింగ్‌ సిబ్బందికి వాహనాలు సమకూర్చడం, జిల్లాల సరిహద్దుల్లో పోలింగ్‌ సిబ్బంది వెళ్లడం వంటి అంశాల్లో సమన్వయం ఉండాలన్నారు. కొటియా గ్రామాల్లో ఎన్నికల నిర్వహణ, సరిహద్దుల గుండా మద్యం రవాణా, రైల్వేలు – బస్సుల ద్వారా గంజాయిని తరలింపు నియంత్రణ, ఇరువైపుల సరిహద్దు చెక్‌పోస్టులపై నిఘా ఉంచాలని తెలిపారు. ఎన్నికలకు వాహనాలను సమకూర్చడంలో రెండు వైపులా సహకారం అవసరమని ఆయన అన్నారు.కొటియా ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలికొటియా ప్రాంత ఎన్నికలపై కలెక్టర్‌ మాట్లాడుతూ ఓటర్లు స్వేచ్ఛగా, స్వచ్ఛందంగా ఓటు వేయడానికి అవకాశం కల్పించాలని స్పష్టం చేశారు. ఓటు వేయకుండా అడ్డుకోకూడదు” అని ఆయన ఉద్బోధించారు. న్యాయపరమైన పరిధిలో ఉందని ఆయన పేర్కొంటూ జిల్లా యంత్రాంగాలు ఓటర్ల స్వేచ్ఛకు భంగం కలిగించ రాదని స్పష్టం చేశారు. ఓటర్లు తమ ఇచ్చానుసారం ఓటు వేస్తారు, ఇది చారిత్రాత్మకంగా కొనసాగుతోంద అని అన్నారు. మా జిల్లా యంత్రాంగం ఓటర్లను అడ్డుకోదని, మీ జిల్లా యంత్రాంగం ఓటర్లను అడ్డుకోవద్దని స్పష్టం చేయగా అందుకు కోరాపుట్‌ జిల్లా యంత్రాంగం సహకరించేందుకు అంగీకరించింది. 22 గ్రామాలకు 4 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఈ జాబితాను కోరాపుట్‌ జిల్లాకు పంపుతామని కలెక్టర్‌ తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా గుండా వెళ్లే పోలింగ్‌ సిబ్బందికి ఎలాంటి ఆటంకం కలగదని రాయగడ జిల్లా కలెక్టర్‌ అభ్యర్థన మేరకు ఆయన తెలిపారు.ఎస్‌పి విక్రాంత్‌ పాటిల్‌ మాట్లాడుతూ సరిహద్దు చెక్‌ పోస్ట్‌లను ఏర్పాటు చేశామని, సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. కోరాపుట్‌ జిల్లా కలెక్టర్‌ వి కీర్తి వాసన్‌ మాట్లాడుతూ ప్రశాంతంగా, సజావుగా ఎన్నికల నిర్వహణకు అన్ని అంశాల్లో సమన్వయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. కొటియా ప్రాంతంలో 8 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామని, అందులో 2 కేంద్రాలు సరిహద్దుకు సమీపంలో ఉన్నాయని చెప్పారు. కొటియా గ్రామాల్లో ఓటర్లకు తమ జిల్లా యంత్రాంగం ఎలాంటి ఆటంకాలు కలిగించవని తెలిపారు. రాయగడ కలెక్టర్‌ మనోజ్‌ సత్యవాన్‌ మహాజన్‌ మాట్లాడుతూ కొంతమంది పోలింగ్‌ సిబ్బంది కొమరాడ మండలం మీదుగా పోలింగ్‌ కేంద్రాలకు చేరుకోవాల్సి ఉందని, ఈ తరుణంలో సహకరించాలని కోరారు. రాయగడ ఎస్‌పి హరీష్‌ బిసి, కోరాపుట్‌ పోలీసు అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఇన్‌ఛార్జ్‌ డిఆర్‌ఒ జి.కేశవనాయుడు, ఎస్‌డిసి ఆర్‌వి సూర్యనారాయణ, జిల్లా రవాణా అధికారి సి.మల్లిఖార్జునరెడ్డి, ఎస్‌ఇబి ఎఇ ఎస్‌ జీవన్‌ కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.ఆంధ్రా – ఒడిశా పోలీసుల సంయుక్త తనిఖీలుప్రజాశక్తి – పార్వతీపురంఎన్నికల నేపథ్యంలో ఆంధ్రా ఒడిశా పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. కొమరాడ, పార్వతీపురం ఎస్‌ఐలు, కోరాపుట్‌ జిల్లా బందుగాం పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది గురువారం పార్వతీపురం మండలం, ఇతర ప్రాంతాల్లో చేపట్టిన తనిఖీల్లో 14,500 లీటర్ల పులియబెట్టిన బెల్లం ఊటను ధ్వంసం చేశారు. అలమండ వద్ద 32 డ్రమ్ముల్లో ఉన్న పది వేల లీటర్లను, కర్లి గ్రామం వద్ద 15 డ్రమ్ముల్లో ఉన్న 4,500 లీటర్ల పులియబెట్టిన బెల్లం ఊటను ధ్వంసం చేశారు.

➡️