మిచాంగ్‌ ముప్ప

Dec 2,2023 20:54

 కురుపాం :బంగాళాఖాతంలో ఏర్పడ్డ మించాంగ్‌ తుపాను వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నట్లు ప్రసారమాధ్యమాల్లో అధికారులు ప్రకటించిన నేపథ్యంలో రైతన్న గుండెల్లో గుబులు మొదలైంది. మండలంలో కోత దశలో ఉన్న వరి పంట చేతికొచ్చే సమయంలో తుఫాను వల్ల వర్షాలు కురిస్తే అపార నష్టం సంభవిస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది వరి పంటకు గడ్డు పరిస్థితని చెప్పవచ్చు. పంట ప్రాథమిక దశలో అనావృష్టి సంభవించడంతో రిజర్వాయర్లు, గెడ్డలు, చెరువుల కింద, బోర్లు నీటి వసతి కలిగిన వద్ద రైతులు సాగు చేపట్టారు. మెట్ట ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితి వల్ల పంటలు ఎండిపోయాయి. తీరా ప్రస్తుతం పంట చేతికి వచ్చే సమయంలో తుఫాన్‌ గండం భయబ్రాంతులకు గురిచేస్తుంది. మండలంలో 23 పంచాయతీల్లో సుమారు 10717 ఎకారాల్లో వరి పంట సాగవుతుంది. దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ పంట పక్వానికి వచ్చి ఉంది. ఈనెల 3 నుంచి 6వరకు విపరీతమైన గాలిలు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రైతున్నకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. వర్షాలకు గాలులు తోడైతే పంట మొత్తం నేలమట్టమవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.వరి కోతలు వాయిదా వేసుకోవాలిరానున్న 24 గంటల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వరి కోతలు వాయిదా వేసుకోవాలని కృషి విజ్ఞాన కేంద్ర పోగ్రాం కోఆర్డినేటర్‌ టి ఎస్‌ ఎస్‌ పాత్రో, వాతావరణ విభాగ శాస్త్రవేత్త కె.ప్రశాంతి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారి వాయువ్య దిశగా కదులుతూ పశ్చిమ మధ్య బంగాళాఖాతం దక్షిణ ఆంధ్రప్రదేశ్‌, ఉత్తర తమిళనాడు తీరా ప్రాంతాలకు ఈనెల 4న విస్తరించి ఉన్నందున ఉత్తర కోస్తాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. కావున వరి కోతలను మూడు రోజులు పాటు వాయిదా వేసుకుని ప్రస్తుతం కోసి ఉన్న వరి కుప్పలను సురక్షిత ప్రాంతానికి తరలించే టార్పాన్లను కప్పు కోవాలని రైతులకు సూచించారు. పాచిపెంట : తుపాను కారణంగా ఆదివారం నుంచి మూడు రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు పంటలను రక్షించుకునేందుకు తగు చర్యలు చేపట్టాలని మండల వ్యవసాయ అధికారి కె.తిరుపతిరావు అన్నారు. మండలంలోని మోసూరు, పాంచాలి, గురువునాయుడుపేట, తదితర గ్రామాల్లో తుఫానుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై రైతులకు అవగాహన కల్పించారు. విఎఎలు రైతులను కలిసి కోసి ఉన్న వరి పంటలను కుప్పలు వేయించారు. అలాగే వరి కోతలను మూడు రోజులపాటు వాయిదా వేసుకోవాలని, నీటి నిల్వను తట్టుకోలేని మొక్కజొన్న, పొగాకు పంటలకు దిగువ ప్రాంతంలో నీరు పోయేలా చిన్న కాలువలను ఏర్పాటు చేసుకోవాలని రైతులకు సూచించారు. ఇప్పటికే వరి కొయ్యల్లో అపరాలు జల్లిన పొలాల్లో కూడా మొలకలు కుళ్లిపోకుండా డ్రైనేజీ కాలవ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వర్షాలు తగ్గిన తర్వాత పత్తి, మొక్కజొన్న వంటి పంటల్లో తెగుళ్లు వచ్చే అవకాశం ఉన్నందున 500 గ్రాముల కాపరక్షక్‌ క్లోరైడ్‌, 200 గ్రాముల కార్బెండ జిమ్‌ పౌడర్‌ ను ఒక కేజీ మల్టీకేతో కలిపి పిచికారీ చేసుకుని 25 కిలోల యూరియాతో పాటుగా 15 కిలోల పొటాషియం మొక్కకు వేసుకోవడం ద్వారా అధిక వర్షాలు నుండి పంటలను రక్షించుకోవడమే కాకుండా స్థిరమైన దిగుబడిలు పొందొచ్చని తెలిపారు. అలాగే అందరూ విఎఎలు ఈ మూడు రోజులు పాటు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

➡️