సోషల్‌ ఆడిట్‌కు సిద్ధంగా ఉండాలి : ఎఒ

Mar 2,2024 21:46

బలిజిపేట : 2023-24 రబీ సీజన్లో ఇ-క్రాప్‌లో నమోదైన పంటల వివరాలను విధిగా రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శించాలని గ్రామసభలు నిర్వహించి వివరాలను చదివి రైతులకు వినిపించాలని మండల వ్యవసాయ అధికారి ఎం.శ్రావణ్‌ కుమార్‌ నాయుడు అన్నారు. మండలంలోని వంతరాం రైతు భరోసా కేంద్రంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ప్రదర్శించిన ఇ-క్రాప్‌ ముసాయిదా జాబితాను పరిశీలించిన అనంతరం ఇ-పంట నమోదులో ఏవైనా చిన్న చిన్న తప్పులు దొర్లినట్లయితే సరి చేసుకోవడానికి ఇదే చివరి అవకాశమని అన్నారు. కావున ఇ-పంటలో నమోదైన రైతుల వివరాలను గ్రామసభల్లో చదివి వినిపించడమే కాకుండా ఆర్‌బికెల్లో ప్రదర్శించాలని అన్నారు. అలాగే రైతు గ్రూపుల్లోనూ, వాట్సాప్‌ల ద్వారా తెలియజేయాలని, ఏవైనా అభ్యంతరాలుంటే వ్యవసాయ కమిషనర్‌ వారు సూచించిన ప్రొఫార్మాలో రాతపూర్వక ఫిర్యాదులను స్వీకరించి వాటిని కరెక్షన్‌ మాడ్యూల్‌లో అప్లోడ్‌ చేసి తప్పులను సవరించాలని తెలిపారు. సర్పంచులకు, ఎంపిటిసి సభ్యులకు, ఇతర ప్రజా ప్రతినిధులు, పెద్దలకు, గ్రామ వ్యవసాయ సలహా మండలి సభ్యులకు అందరికీ వివరాలను పూర్తిగా తెలియజేయాలని కోరారు. ఆదివారంలోగా అభ్యంతరాలు రాత పూర్వకంగా తెలపాలని, సవరణలు పూర్తి చేసి మార్చి 7నాటికి తుది జాబితా తయారు చేసేందుకు వీలుంటుందన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో తుది జాబితా ప్రదర్శన తర్వాత ఎటువంటి మార్పులు, చేర్పులు చేయడానికి వీలుపడదనీ ఇ- క్రాప్‌ నమోదు చేసుకున్నట్లు మీ సెల్‌ ఫోన్‌ నంబర్‌కు మెసేజ్‌ పంపిస్తారని, ఇ -పంట నమోదు పత్రాన్ని ప్రింట్‌ తీసి రైతులకు ఇవ్వనున్నట్టు తెలిపారు. కావున రైతులంతా తమ పంటల నమోదు వివరాలను తెలుసుకొనేలా విస్తృతంగా తెలియజేయాలని విఎఎలను ఆదేశించారు. రైతులు కూడా భాగస్వాములై ఇ- పంట సోషల్‌ ఆడిట్‌ను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో గ్రామానికి చెందిన రైతులు, విఎఎ సాయి, వాలంటీర్లు పాల్గొన్నారు.సీతానగరం : మండలంలోని చినబోగిలి రైతు భరోసా కేంద్రంలో శనివారం ఇ-పంట నమోదు సామాజిక తనిఖీని ఎఒ ఎస్‌.అవినాష్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇ-పంట నమోదు సామాజిక తనిఖీ ఈనెల 1నుంచి 5 వరకు కొనసాగుతుందని, అన్ని ఆర్‌బికెల్లో రైతుల యొక్క ఇ-క్రాప్‌ పంట నమోదును పరిశీలించి, రైతులకు కూడా నమోదు చేసుకోవాలన్నారు. ప్రతి గ్రామంలోనూ రైతుల పేర్లను అందులో పొందుపరచబడతాయన్నారు. కార్యక్రమంలో సిబ్బంది సౌజన్య రైతులు పాల్గొన్నారు.పాచిపెంట : ఇ – క్రాప్‌ సోషల్‌ ఆడిట్లో భాగంగా రైతు భరోసా కేంద్రాల వద్ద ఇ-క్రాప్‌ జాబితాను మార్చి 1 నుంచి 3 వరకు ప్రదర్శించనున్నట్టు తెలిపారు. ఇ-క్రాప్‌ నమోదు పూర్తి పారదర్శకంగా జరగాలనే ఉద్దేశంతో ఇ- పంట నమోదు వివరాలను రైతు భరోసా కేంద్రాల వద్ద ప్రదర్శన జరుగుతుందన్నారు. అలాగే రైతుల సమావేశాలు నిర్వహించి ఈనెల 3 వరకు ఇ-పంటలో నమోదైన వివరాలను రైతులకు తెలియజేస్తామని వ్యవసాయ అధికారి కె.తిరుపతిరావు అన్నారు. పాంచాలి, మాతుమూరు ఆర్‌బికెల వద్ద ఇ-పంట జాబితా ప్రదర్శనను పరిశీలించారు. ఇ- పంట జాబితాలో నమోదైన తప్పులను రైతులు రైతు భరోసా కేంద్రాల వద్ద అందుబాటులో ఉన్న దరఖాస్తు ద్వారా తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఈనెల 5 వరకు సవరించిన చివరి జాబితాను ఈనెల 8న ఆర్‌బికెల్లో అందుబాటులో ఉంటుందని, కావున రైతులంతా ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

➡️