దాహం తీర్చని ‘అమృత్‌’

Apr 12,2024 21:32

పాలకొండ: డివిజన్‌ కేంద్రమైన పాలకొండ నగర పంచాయతీలో ఇంటి ఇంటికీ కుళాయి ఏర్పాటు చేసి పట్టణ వాసులుకు తాగునీటి సమస్య తీర్చేందుకు అమృత్‌ పథకం కింద వాటర్‌ ట్యాంకు నిర్మిస్తామని, ఇంటి ఇంటికి కుళాయిలు ఏర్పాటు చేస్తామని ఊదరగొట్టి చెప్తున్న పాలకులు నేటికి హామీలను అమలు చేయలేదు. ఈ హామీని టిడిపి ప్రభుత్వంతో పాటు ప్రస్తుతం ఉన్న వైసిపి ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. దీంతో పట్టణ వాసులు తాగునీటికి తీవ్ర అవస్థలుపడుతున్నారు. పట్టణంలో సుమారు 5వేల మంది జనాభా ఉండగా, అనేక ప్రాంతాల్లో నీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నాలుగు రక్షిత మంచినీటి పథకాలు ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో నీరు సరఫరా కావడం లేదు. వేసవి కాలమే కాకుండా మిగిలిన కాలంలో కూడా నీటి ఎద్దడి తీవ్రంగానే ఉంది. కోమటిపేట, దేవరపేట, రెల్లివీధి, బడ్డుకొండవారి వీధి, బెల్లాన వీధి, ఇందిరానగర్‌ కాలనీ, తదితర ప్రాంతాల్లో నీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. గతంలో టిడిపి ప్రభుత్వ హయాంలో అప్పటి విద్యుత్‌ శాఖ మంత్రి కళా వెంకట్రావు ఈ పథకానికి శిలాఫలకం వేశారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక దీనిపైన పెద్దగా పట్టించుకునే పరిస్థితి లేదు. ఏడాది క్రితం ఈ పథకంలో భాగంగా కుళాయిలు ఏర్పాటుకు వీధుల్లో పైపు లైన్లు వేశారు. అప్పట్లోనే దీనిపై కౌన్సిలర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. ట్యాంకులు నిర్మించకుండా పైపు లైన్లు వేయడమేమిటని అభ్యంతరం చెప్పారు. అయినప్పటికీ ఇష్టారాజ్యంగా కాంట్రాక్టర్లు పైపు లైన్లు వేసి చేతులు దులుపుకుని, కోటి రూపాయల నిధులు డ్రా చేసినట్లు తెలుస్తుంది. ఏదేమైనా టిడిపి, వైసిపి ప్రభుత్వం హయాంలో అమృతపథకం పూర్తి కాకపోవడం పట్ట పట్టణవాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

➡️