ఈసారీ ఖరీఫ్‌పై సన్నగిల్లిన ఆశలు

May 26,2024 21:29

ప్రజాశక్తి -పాలకొండ/వీరఘట్టం: ఈ ప్రాంత రైతాంగానికి ప్రతిఏటా ఖరీఫ్‌ కష్టాలు తప్పడం లేదు. తోటపల్లి కాలువ ద్వారా చుక్క నీరందకపోవడంతో నిరాశే మిగులుతోంది. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిన రైతులకు సాగునీరందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. దీనిపై రైతుల్లో ఆందోళన మొదలవుతోంది. 2010లో కాంగ్రెస్‌ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య ఈ పనులకు శంకుస్థాపన చేసినా నేటికీ నిధులు కేటాయించలేదు. 2014లో అధికారంలో వచ్చి టిడిపి 2018లో ఎడమ కాలువ ఆధునికీకరణ పనులకు రూ.193 కోట్లు కేటాయించారు. అయితే తోటపల్లి ఎడమ కాలువ పనుల విషయంలో అధికారంలో ఉంటే పాలకులు దానిపై కన్నెత్తి చూడడం లేదు. ప్రతిపక్షంలో ఉంటే రైతులతో కలిసి పోరాటాలు చేస్తూ ప్రభుత్వాన్ని ఎండగట్టడం అలావాటుగా మారింది. గతంలో అధికారంలో లేని సమయంలో శాసనసభాపతి తమ్మినేని సీతారాం, పస్తుత ప్రభుత్వ విప్‌ పాలవలస విక్రాంత్‌ ప్రతిపక్షంలో ఉండేటప్పుడు తోటపల్లి పోరాటంలో చురుగ్గా పాల్గొనేవారు. అధికారంలోకి వచ్చాక దాని ప్రసక్తే లేదు. 13 కిలోమీటర్ల పనులే2018లో తోటపల్లి ఎడమ కాలువ ద్వారా 37 కిలోమీటర్ల విస్తరణ పనులకు గానూ రూ.193 కోట్లు నిధులు కేటాయించారు. అయితే ఇప్పటి వరకు కేవలం 13కిలో మీటర్లు పనులు మాత్రమే పూర్తయ్యాయి. బ్యారేజ్‌ నుంచి 13 కిలోమీటర్ల పనులు పూర్తి కావడంతో రైతుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. జరిగిన పనులకు రూ.48 కోట్లు బిల్లులు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సి ఉన్నప్పటికీ అవి కూడా పూర్తి స్థాయిలో చెల్లించనట్లు తెలుస్తోంది. దీంతో కాంట్రాక్టర్లు కూడా పనులు చేసేందుకు ముందుకు రావడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఏటా ఇబ్బందేఖరీఫ్‌ సీజన్‌లో రైతన్నలకు ఇబ్బందులు తప్పడం లేదు. సాగునీరందక వర్షాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఎడమ కాలువ కిందన 32 వేల ఎకరాలు సాగు అవుతుంది. అందులో శివారు ప్రాంతం 14 వేల ఎకరాల వరకు ఉంది. ముఖ్యంగా వీరఘట్టం, పాలకొండ మండలాలు శివారు ప్రాంతంలో ఉండడంతో ఇటువైపు రైతాంగానికి సాగునీరందడం లేదు. ఈసారి కూడా ఇదే సమస్య ఎదురవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.వీరఘట్టం : తోటపల్లి ప్రధాన ఎడమ కాలువ ద్వారా మండలంలోని కొట్టుగుమ్మడ, నడుకూరు, గడగమ్మ, పివిఆర్‌ పురం, తదితర గ్రామాలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందకపోవడంతో రైతులు వర్షాలు పైన ఆధారపడి సాగు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. టిడిపి హయాంలో మంజూరైన నిధులతో కాలువకు ఇరువైపుల సోప్‌తో పాటు బెడ్‌ పనులు చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. ఆధునీకరణ పనులు పూర్తయితే ఏడాదికి రెండు పంటలు సాగు చేసుకోవచ్చని రైతులు ఆశపడ్డారు. అయితే ఆశపై పాలకులు సకాలంలో నిధులు మంజూరు చేయకపోవడంతో ప్రతిఏటా ఖరీఫ్‌లో రైతులకు నిరాశే మిగులుతోంది. సాగునీరందకపోవడంతో కొట్టుగుమ్మడ, గడగమ్మ, నడుకూరు, పివిఆర్‌ పురం గ్రామ రైతులు వర్షాలపైనే ఆధారపడి ప్రతి ఏటా పంటలు సాగు చేస్తున్నారు. ఈ గ్రామాలకు తోటపల్లి ప్రధాన ఎడమ కాలువ మొదటి కెనాల్‌ నుంచి సాగునీరు రావాల్సి ఉన్నప్పటికీ వీటికి పైనున్న విక్రంపురం, చిట్టపూడివలస, కడకల్లా, నడిమికెళ్ల, రావివలస గ్రామ రైతులు ఎగువున పూనులు వేయడం వల్ల తమ గ్రామాలకు వచ్చేసరికి అడుగు నీరు కూడా రావడం లేదని, దీంతో చేసేదేమీ లేక అవకాశం ఉన్న రైతులు బోర్లు ద్వారా పంటలు సాగు చేసుకుంటున్నారు. ఈ అవకాశం లేనివారు వరుణుడిపైనే ఆధారపడి సాగు చేస్తున్నారు. పంటలపై పెట్టిన పెట్టుబడులు రాక అప్పులు ఊబిలో కూరుకు పోతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి కోసం అన్నదాతలు ఆరాటంమండలంలోని కొట్టుగుమ్మడ, గడగమ్మ గ్రామాలు శివారు ప్రాంత భూములు కావడంతో తోటపల్లి ప్రధాన ఎడమ కాలువ ద్వారా సాగునీరు సక్రంగా రాకపోవడంతో ప్రతి ఏటా సాగునీటి కష్టాలు తప్పడం లేదు. తోటపల్లి ప్రధాన ఎడమ కాలువ మొదటి కెనాల్‌ నుంచి తమ గ్రామాలకు సాగునీరు రావాల్సి ఉన్నప్పటికీ ఎగువ ప్రాంతానున్న రైతులు నీటిని కిందకి రానీయకుండా అడ్డుకుంటున్నారన్నారు. నడిమికెళ్ల నుండి చివరి ప్రాంతమైన కొట్టు గుమ్మడ వరకు కాలువలో పేరుకుపోయిన గుర్రపు డెక్కలు తొలగిస్తే కొంతమేర నీరు వస్తుందని ఆశతో రెండు గ్రామాల చెందిన రైతులు స్వచ్ఛందంగా గుర్రపు డెక్కలు తొలగించుకుంటున్నారు. అయినా శ్రమ తప్ప ఫలితం లేకలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పైన తోటపల్లి ప్రధాన ఎడమ కాలువ, గ్రామాలకు పక్కన నాగావళి నది, చుట్టూ నదులున్న గ్రామాలకు మాత్రం సాగునీరందడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగునీరు విడిచి పెట్టినప్పుడల్లా పాలకుల, అధికారులు శివార ప్రాంతాల వరకు సాగునీరందిస్తామని ప్రకటనకే పరిమితం అవుతున్నారు తప్ప కనీసం రైతులకు అవసరమైన సాగునీరు అందుతుందా, లేదా అన్న విషయాన్ని పట్టించుకోవడంలేదని రైతులు విమర్శిస్తున్నారు.

➡️