కొత్త ప్రభుత్వానికి సమస్యల స్వాగతం

Jun 17,2024 21:29

గుమ్మలక్ష్మీపురం:  కొత్త ప్రభుత్వానికి మన్యం జిల్లాలో సమస్యలు స్వాగతం పలకబోతున్నాయి. కురుపాం నియోజకవర్గంలో దీర్ఘకాలిక సమస్యలున్నా గత ప్రభుత్వాలు, పాలకులు పట్టించుకోకపోవడంతో ఆ సమస్యలు సమస్యగానే మిగిలిపోయింది. దీంతో గిరిజన ప్రాంతం అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. కొత్త ఎమ్మెల్యేలు, మంత్రులు రాకతోనైనా మన్యం జిల్లాలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గాడి తప్పిన ఐటిడిఎగిరిజనాభివృద్ధి కోసం ఏర్పాటైన ఐటిడిఎ ఐదేళ్లుగా పాలనలో గాడి తప్పింది. మూడు నెలలకు ఒకసారి నిర్వహించాల్సిన పాలకమండల సమావేశాల ప్రస్తావన లేకుండా పోయింది. ఐటిడిఎ స్పెషల్‌ డిఎస్‌సి ఊసే లేదు. ఆదివాసీ ఆరోగ్య కార్యకర్తలు లేకపోవడంతో ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు వైద్యం గగనమైంది. విద్యార్థుల మరణాలు జరుగుతున్నా నివారణ చర్యలు మాత్రం శూన్యం. ట్రైకార్‌ రుణాలు గిరిజనులకు అందించి చాలా కాలం అయింది. సబ్సిడీపై వ్యవసాయ రుణాలు, విత్తనాలు, ఎరువుల పంపిణీ కూడా లేవు. సిఆర్‌టిల రెగ్యులరైజేషన్‌ నియామకంలో లంచాల పర్వంగా కొనసాగింది. అయినా బాధ్యులపై చర్యలు లేవు. స్థానికంగా ఉపాధి లేక గిరిజనులు వలస బాట పడుతు న్నారు. గుమ్మ లక్ష్మీపురంలో డైట్‌ కళాశాల ఏర్పాటుకు చేసిన ప్రతిపాదన నీరుగారింది. ఈ సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వంపై ఉంది. పరిశ్రమల ప్రస్తావనే లేదుగత ప్రభుత్వాల హయాంలో మన్యం జిల్లాలో పరిశ్రమల ప్రస్తావనే లేకుండా పోయింది. పార్వతీపురం, సీతంపేట ఐటిడిఎల పరిధిలోని గుమ్మలక్ష్మీపురం, కురుపాం, సీతంపేట, సాలూరు ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో ఉన్న జీడి, చింత పంటలు, కొండచీపుర్లు, కొండతామర, పసుపు వంటి అటవీ ఫలసాయాలపై గిరిజనులు ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఐటిడిఎ ద్వారా ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తే వలసలు నివారించవచ్చు. చేపల ఉత్పత్తి కేంద్రం, తూనికాకు పరిశ్రమలు ఏర్పాటుతో మరింత ప్రయోజనం ఉంటుంది. గత ప్రభుత్వాలు వీటిపై శ్రద్ధ వహించలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుతోనైనా ఉపాధి దొరుకుతుందని మన్యం ప్రాంత వాసులు భావిస్తున్నారు.అడవి ఏనుగులతో రక్షణ కరువుమన్యం జిల్లాలో గత కొన్నేళ్లుగా నలుదిక్కుల సంచరిస్తున్న అడవి ఏనుగులతో ప్రజలకు, పంటలకు రక్షణ లేకుండా పోయింది. భామిని, జియ్యమ్మవలస, గరుగుబిల్లి, కొమరాడ మండలాల్లో సంచరిస్తున్న అడవి ఏనుగుల గుంపును తరలించే చర్యలు చేపట్టడంలో గత ప్రభుత్వాలు, పాలకులు కనీసం శ్రద్ధ వహించలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో కొత్తగా ఎంపికైన ఎమ్మెల్యేలు, మంత్రులు ఏనుగుల తరలింపునకు దృష్టి సారిస్తారని, రక్షణ కల్పిస్తారని ప్రజలు ఆశిస్తున్నారు.నాన్‌ షెడ్యూల్డ్‌ గ్రామాలతో రిజర్వేషన్లు కరువు జిల్లాలో పలు మండలాల్లోని గిరిజన గ్రామాలు నేటికీ నాన్‌ షెడ్యూల్‌ గ్రామాలు గానే ఉన్నాయి. ఇక్కడ నివసిస్తున్న గిరిజనులకు ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు కరువయ్యాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు కూడా అందడం లేదు. దీంతో గిరిజనులు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉన్నారు. షెడ్యూల్డ్‌ గ్రామాలుగా గుర్తించాలని గిరిజనులు కోరుతున్నారు.నేటికీ సాగు, తాగునీరు కరువేమన్యం జిల్లాలో ప్రధానంగా గిరిజన ప్రాంతంలో గిరిజనులు దాహార్తి తీర్చుకునేందుకు స్వచ్ఛమైన తాగునీరందడం లేదు. చలమలు, గెడ్డవాగులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. జల జీవన్‌ మిషన్‌ పనులు ప్రారంభానికి నోచుకోలేదు. మరోవైపు పంట పొలాలకు సాగునీరందక ప్రతి ఏటా వర్షాధారంపైనే ఆధారపడి పంటలు పండిస్తున్నారు. గత మూడేళ్లగా కరువు కోరల్లో ఏజెన్సీ చిక్కుకుంది. గుమ్మలక్ష్మీపురం, కురుపాం ఏజెన్సీ మండలాల్లో మినీ రిజర్వాయర్లు, చెక్‌ డ్యాములు గత ప్రభుత్వాల నిర్లక్ష్యంగా పడకేశాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటుతోనైనా ఖరీఫ్‌ నాటికి సాగునీరందిస్తారని రైతులు కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు.వర్షాకాలం వస్తే మరణ మృదంగమేవర్షాకాలం వచ్చిందంటే చాలు మన్యం జిల్లాలో మరణ మృదంగం వినిపిస్తోంది. ఆశ్రమ పాఠశాల విద్యార్థులు, గిరిజనులు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇదే సమయంలో మెరుగైన వైద్యమందక మృత్యువాత పడుతున్నారు. వివిధ రకాల కారణాలతో ఏడాదిలో కనీసం పది మంది విద్యార్థులు చదువుకొనే ప్రాయంలో మృత్యువుడికి చేరడం తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది. మరణాల అదుపునకు గత ప్రభుత్వాలు కనీసం స్పందించలేదు. రానున్న ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి సారించి ఆదివాసీ ఆరోగ్య కార్యకర్తలను నియమించి మెరుగైన వైద్యం అందించాల్సిన అవసరం ఉంది.కలగానే క్రీడ మైదానాలుమన్యం జిల్లాలో గుమ్మలక్ష్మీపురం, జియమ్మవలస మండలం రావాడ రామభద్రపురంలో క్రీడా మైదానాల ఏర్పాటు ప్రక్రియ కలగానే మిగిలిపోయింది. ప్రతిపాదనలు తయారుచేసి నిధులు కేటాయించినా పనులు మాత్రం ప్రారంభం కాలేదు. గత 15 ఏళ్లుగా ఈ ప్రక్రియ నిలిచిపోయింది. గుమ్మలక్ష్మీపురంలో ఇండోర్‌ స్టేడియం పనులు ఐదేళ్లుగా మధ్యలోనే నిలిచిపోయాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటుతోనైనా క్రీడా మైదానాల పనులు ప్రారంభించి క్రీడాకారుల ప్రోత్సహించాలని కోరుతున్నారు.

➡️