వైద్యాన్ని లాభాపేక్షతో కాకుండా సేవదృక్పథంతో చూడాలి

Jun 25,2024 23:21

విలేకర్లతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు, ఆస్పత్రి వైద్యులు
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :
అనేక విభాగాల్లో అరుదైన వైద్య చికిత్సలకు చిరునామాగా అంజిరెడ్డి హాస్పిటల్‌ నిలిచిందని ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు వంటి మహా నగరాల్లో జరుగుతున్న అధునాతన వైద్య చికిత్సలు, ఆపరేషన్లు డాక్టర్‌ అంజిరెడ్డి హాస్పిటల్‌లో నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు అన్నారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని సత్తెనపల్లి రోడ్డులో గల డాక్టర్‌ అంజిరెడ్డి హాస్పిటల్‌ను ఎమ్మెల్యే మంగళవారం సందర్శించారు. వైద్య రంగాన్ని లాభాపేక్షతో కాకుండా అంకితభావంతో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందాలని అన్నారు. డాక్టర్‌ అంజిరెడ్డి హాస్పిటల్‌లో ఇటీవల చెవిటి, మూగ పిల్లలకు కాక్లియర్‌ ఇంప్లాంటేషన్‌ ఆపరేషన్లు విజయవంతం అయ్యాయని, వీరికి పరికారాలను ఎమ్మెల్యే స్విచ్‌ ఆన్‌చేసి ప్రారంభించారు. డాక్టర్‌ అంజిరెడ్డి హాస్పిటల్‌లో మొట్టమొదటిసారిగా ఎఎస్‌డి క్లోజర్‌ (అట్రియల్‌ సెప్టల్‌ డిఫెక్ట్‌) సహాయంతో పేషెంట్‌కు గుండె గదులను వేరుచేసి మిషన్‌ ద్వారా పేషెంట్‌ ప్రాణాలు కాపాడిన డాక్టర్‌ అంజిరెడ్డి హాస్పిటల్‌ వైద్య బృందాన్ని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. దీంతో పాటు ఇప్పటికి 100 మందికి పైగా మూగ, చెవుడు పిల్లలకు కాక్లియర్‌ ఇంప్లాంట్‌ ఆపరేషన్‌లు విజయవంతంగా నిర్వహించిన అరుదైన రికార్డ్‌ డాక్టర్‌ అంజిరెడ్డి హాస్పిటల్‌ సొంతం చేసుకుందన్నారు. అత్యాధునిక వైద్య పరికరాలతో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్న అంజిరెడ్డి హాస్పిటల్‌ యాజమాన్యాన్ని ఎమ్మెల్యే అభినందించారు. డాక్టర్‌ అంజిరెడ్డి హాస్పిటల్స్‌ అధినేత డాక్టర్‌ లోకిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ చాగంటి వారిపాలేనికి చెందిన మహిళ తీవ్రమైన గుండె నొప్పితో తమ హాస్పిటల్‌లో సంప్రదించగా గుండె వైద్య నిపుణులు డాక్టర్‌ కోట శబరి గిరీష్‌ పరీక్షలు నిర్వహించి రోగి గుండెలో 2 గదులకు ఉన్న రంద్రాన్ని గుర్తించి ఆపరేషన్‌ చేశారని వివరించారు. నరసరావుపేట పట్టణంలో ఇలాంటి సంక్లిష్టమైన ఆపరేషన్లు విజయవంతం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. డాక్టర్‌ అంజిరెడ్డి హాస్పిటల్‌ వైద్య సేవలను పల్నాడు, పక్క జిల్లాల ప్రజలు సద్వినియోగపరుచుకోవాలని కోరారు.

➡️