మోడల్‌ స్కూల్‌ రోడ్డును సందర్శించిన ఎమ్మెల్యే

ప్రజాశక్తి-కనిగిరి: కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సోమవారం సాయంత్రం కనిగిరి మున్సిపాలిటీ పరిధిలో గార్లపేట రోడ్డులోని ఆదర్శ పాఠశాలకు వెళ్లే మట్టి రోడ్డును, పాఠశాలను సందర్శించారు. అధ్వానంగా ఉన్న మోడల్‌ స్కూల్‌ రోడ్డును తారు రోడ్డుగా మార్చేందుకు ప్రతిపాదనలు తయారు చేయాలని ఆర్‌అండ్‌బి అధికారులను పిలిపించి ఆదేశించారు. వర్షాలు వస్తే విద్యార్థులు పాఠశాలకు వచ్చేందుకు ఇబ్బంది పడతారని, ఈలోపు అధ్వానంగా ఉన్న మట్టి రోడ్డును మెటల్‌ రోడ్డుగా నిర్మాణ పనులు చేపట్టాలని ఆదేశించారు. ఆదర్శ పాఠశాలను, వసతి గృహాన్ని పరిశీలించి పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు సర్వశిక్ష అభియాన్‌ అధికారులను సంప్రదించి ప్రతిపాదనలు తయారు చేయించాలని పాఠశాల ఎస్‌ఎంసి చైర్మన్‌ గోపిశెట్టి బాలచెన్నారావుకు సూచించారు. అనంతరం గార్లపేట రోడ్డు నుంచి శంఖవరం మీదుగా కందుకూరు ఉన్న రోడ్డును ఆయన పరిశీలించారు. శంకవరంలో గ్రామస్తులతో మాట్లాడారు. రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపడతానని వారికి ఎమ్మెల్యే డాక్టర్‌ తెలియజేశారు. ఆయన వెంట కనిగిరి పట్టణ అధ్యక్షులు తమ్మినేని శ్రీనివాసరెడ్డి, తెలుగు యువత అధ్యక్షులు షేక్‌ ఫిరోజ్‌, నాయకులు తమ్మినేని వెంకట్‌రెడ్డి, షేక్‌ అహ్మద్‌, షేక్‌ బారాయిమామ్‌, తమ్మినేని సురేంద్ర, శ్రీను, కొండలు, నాగ, ఆర్‌అండ్‌బి ఏఈ ఫిరోజ్‌ తదితరులు ఉన్నారు.

➡️