క్వారీ సమస్యపై మాట్లాడుతా : ఎమ్మెల్యే

Jun 15,2024 21:12

 ప్రజాశక్తి- భోగాపురం : క్వారీ వ్యవహారంపై అధికారులతో మాట్లాడుతానని ఎమ్మెల్యే లోకం మాధవి రామచంద్ర పేట గ్రామస్తులకు తెలిపారు. ఈ గ్రామ సమీపంలో జిఎంఆర్‌ సంస్థ గత రెండు రోజుల నుండి క్వారీ పనులు చేస్తుండగా గ్రామస్తుల అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా క్వారీని జిఎంఆర్‌ సంస్థ గ్రామ సమీపంలో ఏర్పాటు చేయడం వలన రానున్న రోజుల్లో తీవ్ర ఇబ్బందులు పడతామని ఆమెకు గ్రామస్తులు శనివారం క్యాంప్‌ ఆఫీస్‌ లో కలిసి వివరించారు. ఇప్పటికే ఉన్న క్వారీల వలన పేలుళ్లతో ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. దీనిపై ఆమె స్పందించి నేరుగా గ్రామానికి వెళ్లి జిఎంఆర్‌ సంస్థ కొత్తగా ఏర్పాటు చేసిన క్వారీని పాఠశాల వద్ద నుంచి పరిశీలించారు. దీనిపై జిల్లా ఉన్నత స్థాయి అధికారులతో మాట్లాడి అనుమతులు ఏ విధంగా ఇచ్చారో పరిశీలిస్తామని తెలిపారు. అధికారులను ఇక్కడకు రప్పించి సమస్యను పరిష్కరించే దిశగా మాట్లాడుతానని తెలిపారు.

ఎమ్మెల్యేకు పశుసంవర్థక శాఖాధికారుల అభినందన

నెల్లిమర్ల ఎమ్మెల్యే మాధవిని పశుసంవర్ధక శాఖకు చెందిన జిల్లా అధికారులతో పాటు నియోజకవర్గంలోని వైద్యాధికారులు శనివారం అభినందనలు తెలిపారు. ముంజేరు సమీపంలోని మిరాకిల్‌ క్యాంప్‌ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి ఏ విశ్వేశ్వరరావు, డివిజనల్‌ ఉపసంచాలకులు వైవి రమణ, సహాయసంచాలకులు చక్రవర్తి, మహాపాత్రో, నాలుగు మండలాలకు చెందిన వైద్యులు పాల్గొన్నారు. రైతులకు అందుబాటులో ఉండి పశువులకు వైద్య సేవలు అందించాలని ఈ సందర్భంగా ఆమె వారికి సూచించారు.

➡️