ప్రజాస్వామ్యాన్ని హైజాక్‌ చేస్తున్న మోడీ

May 26,2024 21:06

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి: ప్రజలను మరోసారి మోసగించి అధికారంలోకి వచ్చేందుకు ప్రధాని మోడీ ప్రజాస్వామ్యాన్ని హైజాక్‌ చేస్తున్నారని, ఇందుకోసం మోడీ, బిజెపి నాయకులు ఎన్ని అడ్డదారులు తొక్కినా కేంద్ర ఎన్నికల సంఘం ప్రశ్నించడం లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. అలాగే రాష్ట్రంలో అమలు చేస్తున్న ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌కు వైసిపి, టిడిపి ఇరు పార్టీలూ బాధ్యత వహించాలన్నారు. ‘మళ్లీ కలుద్దాం’ అంటూ పార్వతీపురంలో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యాన ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో ఆదివారం గెట్‌ టుగెదర్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజమని, ఫలితాల మాట ఎలా ఉన్నా విప్లవ స్ఫూర్తితో పనిచేయాలని పునరుద్ఘాటించారు. ఎన్నికల్లో అడ్డదారుల్లో గట్టెక్కేందుకు వైసిపి, టిడిపి డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేశాయని విమర్శించారు. సిపిఎం అందుకు భిన్నంగా ప్రజల నుంచి ఓట్లతో పాటు ఎన్నికల ఖర్చులకు విరాళాలు సేకరించిందన్నారు. ఆ మూడు పార్టీలూ డబ్బులు పెట్టి జన్నాన్ని పోగేసి ప్రచారం చేస్తే, సిపిఎం కార్యకర్తలు, అభిమానులు, ఇండియా వేదికను బలపరిచే వారు, అనేక సంఘాల నాయకులు స్వచ్ఛందంగా పనిచేశారని వివరించారు. ఇందులో భాగంగానే కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిశోర్‌ చంద్రదేవ్‌ కూడా సిపిఎం అభ్యర్థుల గెలుపునకు కృషి చేశారన్నారు. గతంలో కురుపాం గెలిచి, ఆ తర్వాత ఓడిపోయినప్పటికీ ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తున్నామని గుర్తు చేశారు. బిజెపి, మోడీ తప్పులను ఎన్నికల సంఘం ప్రశ్నించడం లేదని విమర్శించారు. క్విడ్‌ ప్రోకోకు పాల్పడుతోందని విమర్శించారు. మోడీ అవినీతి బయటకుండా ప్రజల దృష్టిని మల్లించేందుకే ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌ను అక్రమంగా అరెస్టు చేశారన్నారు. ఈ విషయాన్ని ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు తేటతెల్లం చేసిందన్నారు. పౌర హక్కుల విషయంలో రాజీపడకుండా తీర్పులివ్వడం అభినందనీయమన్నారు. బిజెపి మరోసారి అధికారంలోకి వస్తే కోర్టులపై కుడా పెత్తనం చెలాయించే అవకాశం లేకపోలేదని ఆందోళన వ్యక్తంచేశారు. కౌంటింగ్‌ ముగిశాక ఎన్నికల్లో ఓట్ల వివరాలు బహిర్గతం చేయాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్‌ చేశారు. మోడీ, బిజెపి నాయకులు ఎన్నికల్లో మ్యాన్‌ప్లేట్‌ చేసి, ఫలితాలు తారుమారు చేయడంలో సిద్ధహస్తులని విమర్శించారు. కేంద్రంలో తిరిగి ఎన్‌డిఎ కూటమి గెలిస్తే మన రాష్ట్రానికి మరోసారి శని పట్టినట్టేనన్నారు. అదే జరిగితే ప్రజల హక్కులు, రాజ్యాంగ పరిరక్షణపై పోరాడే భాధ్యత కమ్యూనిస్తులదేన్నారు. అందుకు శ్రేణులంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఎవరు గెలిచినా, వారు ఇచ్చిన వాగ్దానాలను ప్రజలకు గుర్తు చేయాలన్నారు. కార్పొరేట్లకు సులువుగా భూములు బదలించేందుకే ఈ చట్టం చేస్తున్నారని నీతి అయోగ్‌ స్పష్టంగానే చెప్పిందని గుర్తు చేశారు. ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌కు వైసిపి, టిడిపి బాధ్యులేనన్నారు. కేంద్రం చేసిన ఈ చట్టన్ని రెండు పార్టీలూ పార్లమెంట్‌లో బలపర్చాయని గుర్తు చేశారు. పార్లమెంట్‌లో ఈ చట్టాన్ని వ్యతిరేకించింది కేవలం సిపిఎం ఒక్కటేనన్నారు. చిత్తశుద్ధి ఉంటే కేరళ తరహా అభివృద్ధి చేయాలని సూచించారు. ఎంతో ఆదర్శవంతమైన బుద్ధిజం మతాన్ని నాశనం చేసినవారే నేడు గతంలో ముస్లిం, క్రిస్టియన్‌ మతాలను అంతమొందించేందుకు ప్రయత్నిస్తున్నారని బిజెపిని విమర్శించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.సుబ్బరావమ్మ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా గుర్తించిన ప్రజా సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. అరకు పార్లమెంట్‌ సిపిఎం అభ్యర్థి పి.అప్పలనరస మాట్లాడుతూ స్పష్టమైన రాజకీయ విధానంతో సిపిఎం పోటీ చేసిందన్నారు. సిపిఎం కురుపాం ఎంఎల్‌ఎ అభ్యర్థి మండగి రమణ మాట్లాడుతూ గెలుపోటములతో నిమిత్తం లేకుండా నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజాసమస్యల పరిష్కారానికి పాటు పడతానని అన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాధం, పార్టీ సీనియర్‌ నాయకులు ఎం.కృష్ణమూర్తి తదితరులు మాట్లాడారు.

➡️