ప్రచారానికి మరింత పదును

May 4,2024 21:41

ఎత్తులు.. పైఎత్తుల్లో నేతలు

గ్రామాల్లో ఉపాధి కూలీలే లక్ష్యం

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ తేదీ దగ్గర పడుతుండడంతో అభ్యర్థులు తమ ప్రచారానికి పదునుపెట్టారు. ఉదయం 8గంటల నుంచే ఇంటింటికీ ప్రచారం చేపడుతున్నారు. గ్రామాల్లో ఓటర్లంతా ఉపాధి పనుల్లో ఉండడంతో అభ్యర్థులు నేరుగా వారి వద్దకే వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ఎండ తీవ్రతతో 11గంటలకే నాయకులంతా ఇళ్లకు చేరుతున్నారు. ఎక్కువ మంది సాయంత్రం నుంచి ప్రచార సభలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. విజయనగరంతో పాటు అన్ని నియోజకవర్గాల్లోనూ వైసిపి, టిడిపి, కాంగ్రెస్‌ అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్లు ప్రచారం చేస్తున్నారు. కురుపాం నియోజకవర్గంలో మాత్రం వైసిపి, టిడిపికి ధీటుగా సిపిఎం నాయకులు ప్రచారం చేపడుతున్నారు. వైసిపి, టిడిపి అభ్యర్థులు ప్రచారంలో పాల్గొనేందుకు జనాలకు డబ్బు, మద్యం సరఫరా చేస్తున్నారు.ఎండల తీవ్రతతో కార్యకర్తలు సైతం ప్రచారంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపకపోవడంతో జనాలతో పాటు వారికి కూడా రూ.300 నుంచి రూ.500 వరకు ఇస్తున్నారు. అన్ని చోట్లా అభ్యర్థులు ఇంటింటికీ తిరగడంతో పాటు కరపత్రాలను పంచుతూ, మైకుల ద్వారా, సోషల్‌ మీడియా వేదికగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధానంగా త్రిముఖ పోరు నెలకొంది. ఈ పోటీలో టిడిపి అభ్యర్థి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైసిపి తరుపున ప్రస్తుత ఎమ్మెల్యే ,డిప్యూటి స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి బరిలో ఉండగా ఇండియా కూటమి తరఫున సుంకరి సతీష్‌, ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే మీసాల గీత పోటిలో ఉండి ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌ ఓటు బ్యాంకును కాపాడుకోవడంతో పాటు ఇండియా కూటమి మద్దతుతో సిపిఎం, సిపిఐ నేతలతో కలిసి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇప్పటికే ప్రధాన పార్టీలు అధి నేతలు వచ్చి సభలు పెట్టి ఎన్నికల వేడిని మరింత పెంచారు. మరోవైపు ఎమ్మెల్యే కోలగట్లకు గట్టి పోటీ ఇస్తున్న టిడిపి అభ్యర్థి పూసపాటి అతిధి గజపతి విజయం కోసం వ్యూహ, ప్రతి వ్యూహాలతో కదులుతున్నారు. అంతే ధీటుగా వైసిపి అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు.ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ సంఘాల నాయకులు, ద్వితీయ శ్రేణి పెద్దలతో ఆయన సమావేశాలు నిర్వహిస్తూ విజయానికి సహకరించాలని కోరుతున్నారు. సాయంత్రం వార్డుల్లో బహిరంగ సభలు ద్వారా మేనిఫెస్టోను వివరిస్తూ ప్రచారంలో దూకుడు పెంచారు. మెజారిటీ ఓటర్లను తన వైపు తిప్పుకునే విధంగా వ్యూహాలు రచిస్తున్నారు. అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు సైతం ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు.ఈ నేపథ్యంలో ప్రచారం ఊపందుకుంది. ఓట్ల లెక్కలతో బిజీబిజీ పోలింగ్‌ బూత్‌ ల వారీగా ఎవరెవరికి ఎన్ని ఓట్లు పడతాయనే అంశంపై ప్రధానంగా అభ్యర్థులు ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు. తమకు అనుకూలంగా ఉన్న వారెవరు? ప్రతికూలంగా ఉన్న వారెవరు? ఇలాంటి వారిని తమవైపు ఎలా తిప్పుకోవాలని వ్యూహాలు రచిస్తున్నారు. అవసరమైతే వ్యతిరేకంగా ఉన్న ఓటర్లను కలిసి ప్రసన్నం చేసుకునే పనిలో అభ్యర్థులు, వారి అనుచరులు నిమగమయ్యారు. ప్రధానంగా అధికార పార్టీ నేతలు వాలంటీర్ల ద్వారా ఓటర్ల వివరాలను సేకరించి అనుకూల అంశాలపై చర్చిస్తున్నారు. అవసరమైతే ప్రలోభపెట్టి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.

➡️