అర్‌అర్‌తో ఎంపీ, ఎమ్మెల్యే మంతనాలు

ప్రజాశక్తి – రాయచోటి 1952లో రాయచోటి నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి రాజకీయాల్లో పెను సంచలన మార్పులకు నాంది పలికింది. 2009 నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఉమ్మడి కడప జిల్లాలో లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గం కనుమరుగైంది. దీంతో గడికోట, రెడ్డెప్పగారి కుటుంబాలు రాయచోటికి వలస వచ్చాయి. 2009 ఎన్నికల తర్వాత రాయచోటి టిడిపికి పెద్ద దిక్కుగా ఉన్న సుగవాసి పాలకొండ రాయుడు నెమ్మదిగా రాజకీయాలకు దూరమవుతూ వచ్చారు. ఆయన అనంతరం సుగవాసి బాలసుబ్రమణ్యం రాజకీయ తెరంగేట్రం చేశారు. 2014లో లక్కిరెడ్డిపల్లి మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే రెడ్డెప్పగారి రమేష్‌ కుమార్‌రెడ్డి టిడిపి రాయచోటి నియోజకవర్గ బాధ్యతలు తీసుకున్నారు. 2014, 2019 ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. పదేళ్లుగా లక్కిరెడ్డిపల్లి, రాయచోటి టిడిపి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పార్టీ చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు. ఈ సారి రాయచోటి టిడిపి టికెట్‌ మండిపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డికి ఇవ్వడం, ఆర్‌ఆర్‌కు టికెట్‌ కేటాయించక పోవడంతో తీవ్ర నిరాశ కు గురయ్యారు. ప్రతి మండలంలో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి కార్యకర్తల అభిప్రాయాలను సేకరించారు. తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని కొద్ది రోజులుగా సైలెంట్‌గా ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో రమేష్‌ రెడ్డి పార్టీ మారుతారన్న వార్తలు హల్చల్‌ చేశాయి. వైఎస్‌ వర్ధంతి నాడు వైసిపి తీర్థం పుచ్చుకుంటారన్న వార్తలు వెలువడ్డాయి. కానీ రమేష్‌ రెడ్డి వైసిపిలోకి వెళ్లలేదు. నిశ్శబ్దంగా ఉన్న రమేష్‌ రెడ్డిని లక్కిరెడ్డి పల్లెలోని ఆయన నివాసంలో శనివారం రాత్రి రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి మంతనాలు జరిపారు. వైసిపిలోకి రావాలంటూ ఆహ్వానించారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈనెల 9,10లలో రమేష్‌ కుమార్‌ రెడ్డి వైసిపిలో చేరుతున్నట్లు సమాచారం.

➡️