నాగూరు టు కురుపాం

Apr 11,2024 21:14

ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం : కురుపాం అసెంబ్లీ నియోజకవర్గం ఎస్‌టి రిజర్వుడ్‌లో ఉంది. 2014 ముందు నాగూరు నియోజకవర్గంగా ఉండేది. ఈ నియోజకవర్గం పరిధిలో గల గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాల్లో ఎక్కువ శాతం గిరిజన ఓటర్లే ఉన్నారు. మిగిలిన జియమ్మవలస, కొమరాడ, గరుగుబిల్లి మండలాల్లో ఎక్కువ శాతం మంది బిసి ఓటర్లు ఉన్నారు. అయితే మొదటి నుంచీ ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా గెలుపొందుతున్న వారంతా గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాల్లో ఉన్న ఓటు బ్యాంక్‌ మెజార్టీతోనే విజయం సాధించడం విశేషం. అందుకే ప్రతిసారి పై రెండు మండలాలపైనే పోటీ చేస్తున్న అభ్యర్థులు ఫోకస్‌ పెడుతుంటారు.కురుపాం అసెంబ్లీ నియోజకవర్గ స్వరూపం కురుపాం నియోజకవర్గంలో కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియమ్మ వలస, కొమరాడ, గరుగుబిల్లి మండలాలు ఉన్నాయి. 137 పంచాయతీలు, 1276 వార్డులు, 71 ఎంపిటిసి స్థానాలు ఉన్నాయి. నియోజకవర్గ విస్తీర్ణం 172.00 చదరపు కిలోమీటర్లు. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 1,92,638 ఉండగా, 268 పోలింగ్‌ స్టేషన్ల ఉన్నాయి. భౌగోళిక పరిస్థితులు… పూర్వం నాగూరు నియోజకవర్గ పరిధిలో కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియమ్మ వలస, కొమరాడ, గరుగుబిల్లి మండలాలు కలిపి 2014లో కురుపాం నియోజకవర్గంగా ఆవిర్భవించింది. వరి,జీడి, జొన్న పంటలు ఎక్కువగా పండిస్తుంటారు. నాగావళి, జంఝావతి, వట్టిగెడ్డ, గుమ్మిడి గెడ్డ వ్యవసాయ సాగుకు అందుబాటులో ఉన్నాయి.నాగూరు టూ కురుపాం2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పూర్వం ఉన్న నాగూరు నియోజకవర్గాన్ని కురుపాం నియోజకవర్గంగా మార్చారు. గరుగుబిల్లి, కొమరాడ మండలాలు రెండు పూర్తిగా కురుపాంలో కలిశాయి. ఇదే నియోజకవర్గంలో శత్రుచర్ల కుటుంబం తొలి నుండి రాజకీయంగా ఆధిపత్యం కొనసాగిస్తూ వచ్చింది. విజయరామరాజు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. నాగూరులో నాలుగు సార్లు, పార్వతీపురం, పాతపట్నంలో ఒక్కొక్కసారి విజయం సాధించారు. ఇక ఈ నియోజకవర్గంలో 2009లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలిచిన జనార్ధన థాట్రాజ్‌ 2014 ఎన్నికల ముందు శత్రుచర్లతో కలిసి టిడిపిలో చేరారు. ఎస్టీ నియోజకవర్గ కావడంతో ఇక్కడ సిపిఎం కూడా పట్టు కొనసాగిస్తోంది. ఇక 2014 ఎన్నికల నాటికి స్థానిక ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి రెండుసార్లు గెలుపుతో కురుపాంలో వైసీపీ ఆధిపత్యం రెండుసార్లు కనిపించింది.1,92,636 మంది ఓటర్లు కురుపాం అసెంబ్లీ నియోజకవర్గంలో 268 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో 1,92,636 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 93,592, మహిళా ఓటర్లు 99,005 ఉన్నారు. థర్డ్‌ జెండర్‌ 39 మంది ఓటర్లు ఉన్నారు. గుమ్మలక్ష్మీపురం మండలంలో 16068 మంది పురుష ఓటర్లు, 18812మంది మహిళా ఓటర్లు, 16మంది థర్డ్‌ జెండర్‌ ఓటర్లు ఉన్నారు. జియమ్మవలస మండలంలో 21,721మంది పురుషులు, 21,978 మహిళలు 8 మంది థర్డ్‌ జెండర్‌ ఓటర్లు ఉన్నారు. కురుపాం మండలంలో 16825 పురుషులు, 18054 మంది మహిళా ఓటర్లు, 12మంది థర్డ్‌ జెండర్‌ ఓటర్లు ఉన్నారు. కొమరాడ మండలంలో 19717 మంది పురుష ఓటర్లు, 21050 మహిళా ఓటర్లు, ముగ్గురు థర్డ్‌ జెండర్‌ ఓటు హక్కు కలిగి ఉన్నారు. గరుగుబిల్లి మండలంలో 19261 పురుషులు,19104 మహిళలు ఓటు హక్కు కలిగి ఉన్నారు.

➡️