అక్రమార్కులకు అడ్డాగా చలమ రేంజ్‌

Mar 20,2024 21:25

మైదానంగా మారిన అడవి ప్రాంతం

అక్రమార్కులకు అడ్డాగా చలమ రేంజ్‌
– పచ్చని చెట్లపై గొడ్డలి వేటు
– మైదానంగా మారుతున్న చలమ అటవీ ప్రాంతం

– పగలు, రాత్రి యథేచ్ఛగా తరలిపోతున్న కలప

– తూతూ మంత్రంగా పరిరక్షణ చర్యలు

ప్రజాశక్తి – మహానంది
మహానంది మండలంలోని చలమ రేంజ్‌ అటవీ సంపద అక్రమ రవాణాకు అడ్డాగా మారింది. అక్రమ రవాణాదారులు కలప రవాణాను మూడు పువ్వులు ఆరు కాయలుగా తరలించుకుపోతున్నారు. వాతావరణం కలుషితం కాకుండా మానావాళిని కాపాడుతున్న పచ్చని చెట్లను విచ్చలవిడిగా నరికివేస్తున్నారు. యథేచ్ఛగా అటవీ సంపద తరలిస్తున్నారు. వేసవిలో వన్యప్రాణులకు నీడనిచ్చే అటవీ సంపద, చెట్లు కనుమరుగు అవుతున్నాయి. మహానంది మంఢలంలోని చలమ రేంజ్‌లో ప్రతి రోజూ ఆళ్లగడ్డ, శిరివెళ్ల, రుద్రవరం ప్రాంతాల నుండి రోజుకు దాదాపు 5 బొలెరో వాహనాలు నల్లమల అడవిలో అక్రమంగా వెళ్తుంటాయి. అక్రమ రవాణాదారులు రుద్రవరం-గాజులపల్లె మీదుగా అడవిలోకి ప్రవేశిస్తారు. చలమ రేంజ్‌ పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతం నుంచి కలపను బొలెరో వాహనాలలో పగలు, రాత్రి తేడా లేకుండా అక్రమంగా తరలిస్తున్నారు. చలమ అటవీ రేంజ్‌లో నిత్యం గొడ్డలి వేటు పడుతోంది. బొలెరో వాహనాల్లో వెదురు కలపను ఒక్కో వాహనంలో 4 టన్నుల చొప్పున రోజుకు 20 టన్నుల దాకా యథేచ్ఛగా తరలించుకు పోతున్నారు. 4 టన్నుల వెదురు కలప 30 వేల రూపాయల చొప్పున ఐదు వాహనాలు కలిపి దాదాపు ఒక లక్ష 50 వేల రూపాయలు ప్రభుత్వానికి గండికొడుతున్నారు. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. చలమ రేంజ్‌లో అధికారుల పర్యవేక్షణ లేక దర్జాగా అడవుల్లోకి వెళ్లి ఆదాయమే లక్ష్యంగా కొందరు అక్రమార్కులు విలువైన వెదురు కలపను దోచుకెళ్తున్నారు. మహానంది మండలంలో చలమ రేంజ్‌ పరిధిలో నలుదిశలా అడవి విస్తరించి ఉండడంతో ఏదో ఒక ప్రాంతం నుంచి అటవీ సంపదను తరలిస్తూనే ఉన్నారు. ఎంతో విలువైన నల్లమల అటవీ సంపదను ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నా, పట్టించుకునే వారే లేరు. కేసులు నమోదు చేస్తున్నారో లేదో కానీ, అటవీ సంపద నరికివేత మాత్రం యథేచ్ఛగా సాగుతోంది. ప్రతి రోజు నంద్యాల- గాజులపల్లె జాతీయ రహదారి మార్గాల్లో అటవీ సంపద తరలిపోతోంది. చేయి తడిపితే ఎటువంటి ఇబ్బంది ఉండదని, లేని పక్షంలో వేలకు వేలు అపరాధ రుసుం వేసి వసూలు చేస్తున్నారని విమర్శలు వెలువెత్తుతున్నాయి. వేసవికాలంలో అటవీ సంపదను కాపాడేందుకు ఫారెస్ట్‌ శాఖ ఉన్నతాధికారులు ఫైర్‌ లైన్లు, యు లైన్లు, ఎల్‌ లైన్లు వంటివి చేయించాలని నిధులు మంజూరు చేశారు. రేంజ్‌ పరిధిలో ఆయా పనులను చేసేందుకు బీట్‌ అధికారులకు నిధులు సరిపోక అక్రమార్కులతో చేతులు కలిపి కలపను తరలించేందుకు మార్గం సుగమం చేసి జేబులు నింపుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విపరీతంగా అటవీ సంపద నరికివేయడంతో వాతావరణ సమతుల్యం దెబ్బతిని, వర్షాలు కురవక కరువు పరిస్థితులు ఏర్పడే ప్రమాదముంటుందని ప్రకృతి ప్రేమికులు వాపోతున్నారు. అడవులు కనుమరుగు అవడంతో వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి అక్రమార్కుల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు.

➡️