ఎన్నికల హడావుడి ప్రారంభం

Mar 23,2024 20:48

వీక్లీ రౌండప్‌

ఎన్నికల హడావుడి ప్రారంభం
ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి
కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసింది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఎన్నికల హడావుడి మొదలైంది. ఎపిలో మే 13న ఎన్నికల పోలింగ్‌ నిర్వహించనున్నారు. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఏప్రిల్‌ 18న అధికారిక నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఆ రోజు నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. నామినేషన్ల స్వీకరణకు ఏప్రిల్‌ 15 చివరి తేదీగా నిర్ణయించారు. ఏప్రిల్‌ 26న నామినేషన్ల పరిశీలన నిర్వహించనున్నారు. అభ్యర్థుల ఉపసంహరణకు గడువు ఏప్రిల్‌ 29గా ప్రకటించింది. ఎన్నికల షెడ్యూల్‌ రావడంతో శనివారం నుంచే ఎలక్షన్‌ కోడ్‌ అమలులోకి వచ్చింది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు ఈ కోడ్‌ వర్తించనుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 33,86,885 మంది ఓటర్లున్నారు. అందులో పురుష ఓటర్లు 16,68,310, మహిళా ఓటర్లు 17,18,001 మంది ఉన్నారు. ఇక థర్డ్‌ జెండర్‌ ఓటర్లు 574 మంది ఉన్నారు. అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే పురుష ఓటర్ల కంటే 49,691 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా మొత్తం ఓటర్లు 20,14,7954 మంది ఉన్నారు. అందులో పురుష ఓటర్లు 9,94,885 మంది ఉండగా మహిళా ఓటర్లు 10,19,597 మంది ఉన్నారు. ఇక థర్డ్‌ జెండర్‌ ఓటర్లు 312 మంది ఉన్నారు. అందులో 24,712 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా మొత్తం ఓటర్లు 13,72,091 మంది ఉన్నారు. అందులో పురుష ఓటర్లు 6,73,425 మంది ఉండగా, మహిళా ఓటర్లు 6,98,404 మంది ఉన్నారు. థర్డ్‌ జెండర్‌ ఓటర్లు 262 మంది ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 24,979 మంది అధికంగా ఉన్నారు.వైసిపి అభ్యర్థులు ఖరారు : వైసిపి అభ్యర్థులను ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ఆ పార్టీ అధినేత వైఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి శనివారం ఇడుపులపాయలో వైసిపి తరపున పోటీ చేసే ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బివై.రామయ్యను, నంద్యాల ఎంపీ అభ్యర్థిగా పోచా బ్రహ్మానందరెడ్డిని ప్రకటించారు. ఎమ్మెల్యే అభ్యర్థుల్లో అధికంగా సిట్టింగ్‌లకే ఛాన్స్‌ ఇచ్చారు. కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్‌ ఆదిమూలపు సతీష్‌ను, ఆదోని ఎమ్మెల్యే అభ్యర్థిగా వై.సాయి ప్రసాద్‌ రెడ్డిని, కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎఎండి.ఇంతియాజ్‌ను, మంత్రాలయం ఎమ్మెల్యే అభ్యర్థిగా వై.బాలనాగిరెడ్డిని, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బుట్టా రేణుకను, పత్తికొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా కంగాటి శ్రీదేవిని, ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బుసినే విరూపాక్షి, నందికొట్కూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్‌ దారా సుధీర్‌ను ప్రకటించారు. బనగానపల్లె ఎమ్మెల్యే అభ్యర్థిగా కాటసాని రామిరెడ్డిని, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థిగా గంగుల బ్రిజేంద్రారెడ్డిని, నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థిగా శింగారెడ్డి రవి చంద్రకిషోర్‌ రెడ్డిని, పాణ్యం ఎమ్మెల్యే అభ్యర్థిగా కాటసాని రాంభూపాల్‌ రెడ్డిని, డోన్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డిని, శ్రీశైలం ఎమ్మెల్యే అభ్యర్థిగా శిల్పా చక్రపాణిరెడ్డిని ప్రకటించారు.టిడిపి ఎంపీ అభ్యర్థులు ఖరారు : టిడిపి ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ మేరకు ఆ పార్టీ అధిష్టానం తమ అభ్యర్థుల మూడో జాబితాను శుక్రవారం విడుదల చేసింది. కర్నూలు టిడిపి ఎంపీ అభ్యర్థిగా బస్తిపాటి నాగరాజును, నంద్యాల టిడిపి ఎంపీ అభ్యర్థిగా బైరెడ్డి శబరిని ప్రకటించారు. కర్నూలు ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు ప్రస్తుతం కర్నూలు మండలం పంచలింగాల ఎంపిటిసి సభ్యునిగా ఉన్నారు. ఆయన గతంలో కాంట్రాక్ట్‌ జూనియర్‌ లెక్చరర్‌ గా పని చేశారు. సినీ రంగంలో పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. కర్నూలు ఎంపీ స్థానానికి టిడిపి నుండి పలువురు ఆశావహులు పోటీ పడ్డారు. నంద్యాల ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి కుమార్తె. ఆమె మొన్నటి వరకూ బిజెపి నంద్యాల జిల్లా అధ్యక్షురాలిగా ఉన్నారు. ఇటీవల బిజెపికి రాజీనామా చేసి చంద్రబాబు నాయుడు సమక్షంలో టిడిపిలో చేరారు. ఆమె ఎంబిబిఎస్‌ విద్యను అభ్యసించారు.

➡️