ఓటర్ల తుది జాబితా విడుదల

Jan 22,2024 19:32

రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఓటర్ల జాబితాను అందజేస్తున్న జిల్లా కలెక్టర్‌

ఓటర్ల తుది జాబితా విడుదల
జిల్లాలో మొత్తం 13 లక్షల 72 వేల 91 మంది ఓటర్లు
– మహిళలు 6,98,404, పురుషులు 6,73,425
ప్రజాశక్తి – నంద్యాల కలెక్టరేట్‌
నంద్యాల జిల్లా ఓటర్ల తుది జాబితాను ఎన్నికల కమిషన్‌ సోమవారం విడుదల చేసింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 13 లక్షల 72 వేల 91 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 6 లక్షల 73 వేల 425 మంది, మహిళలు 6 లక్షల 98 వేల 404 మంది, ట్రాంజెండర్స్‌ 262 మంది ఉన్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ ప్రకటించారు. పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య అత్యధికంగా ఉండడం విశేషం. 24,979 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. పారదర్శకమైన తుది ఓటర్ల జాబితా సిద్ధం : కలెక్టర్‌జిల్లాలో స్వచ్ఛమైన, పారదర్శకమైన తుది ఓటర్ల జాబితాను రూపొందించామని జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో తుది ఓటర్ల జాబితాపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి జాబితా ప్రతులను జాయింట్‌ కలెక్టర్‌ టి.రాహుల్‌ కుమార్‌ రెడ్డితో కలిసి అందచేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఓటర్ల సవరణ కార్యక్రమం ద్వారా స్వీకరించిన దరఖాస్తులు, రాజకీయ పార్టీలు సూచించిన ఫిర్యాదులు, పత్రికల్లో వచ్చిన వ్యతిరేక వార్తలను పరిగణలోకి తీసుకొని ఓటర్ల తుది జాబితాను రూపొందించామని చెప్పారు. జిల్లా మొత్తం జనాభాలో 13 లక్షల 72 వేల 091 మంది ఓటర్లలో పురుషులు 6 లక్షల 73 వేల 425 మంది, మహిళలు 6 లక్షల 98 వేల 404 మంది, ఇతరులు 262 మంది ఉన్నారని తెలిపారు. మొత్తం 1706 పోలింగ్‌ స్టేషన్లలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని చెప్పారు. ఓటర్ల నిష్పత్తిలో జెండర్‌, ఈ.పి రేషియో ఎన్నికల సంఘం సూచించిన మేరకు ఉన్నాయన్నారు. ఓటర్ల జాబితాలో సవరణలు, తొలగింపులు, చేర్పులను క్షేత్రస్థాయిలో, డాక్యుమెంటేషన్‌ స్థాయిలో పకడ్బందీ చర్యలు తీసుకున్నామన్నారు. 8 వేల మంది చెంచు జనాభాలో 5,454 మందిని ఓటర్లుగా నమోదు చేశామన్నారు. 18-19 సంవత్సరాల మధ్య యువ ఓటర్లు 30,165 మంది ఉన్నారని తెలిపారు. 16,723 ఫోటో సిమిలర్‌ ఎంట్రీస్‌, 2,728 డెమో గ్రఫీ సిమిలర్‌ ఎంట్రీస్‌ను కూడా సరి చేశామనివివరించారు. జంక్‌ క్యారెక్టర్స్‌, 10 ఓటర్లకు కన్నా ఎక్కువగా ఉన్న కుటుంబాలను కూడా క్షేత్రస్థాయిలో ఇంటింటి పరిశీలన చేయించి ఓటరు జాబితాలో సరి చేశామని తెలిపారు. కొత్తగా మార్పులు జరిగిన ఓటర్లకు సంబంధించి ఎపిక్‌ కార్డులను కూడా సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో డిఆర్‌ఒ పుల్లయ్య, కాంగ్రెస్‌ పార్టీ తరఫున సయ్యద్‌ రియాజ్‌ బాషా, టిడిపి తరఫున రమణారెడ్డి, శివరామిరెడ్డి, వైసిపి తరఫున అనిల్‌ అమృతరాజ్‌, బిజెపి తరఫున ఉపేంద్ర నాథ్‌ రెడ్డి, సిపిఐ (మార్కిస్టు) తరఫున నరసింహులు, బిఎస్‌పి తరఫున శ్రీనివాసులు, ఆమ్‌ ఆద్మీ పార్టీ తరఫున ప్రదీప్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️