కదం తొక్కిన అంగన్వాడీలు

Dec 18,2023 17:07

నంద్యాల ఆర్డీవో కార్యాలయం ముందు నిరసన ధర్నా చేస్తున్న అంగన్వాడీలు

కదం తొక్కిన అంగన్వాడీలు
– ఆర్‌డిఒ కార్యాలయంకు తరలి వచ్చిన కార్యకర్తలు, ఆయాలు
– కనీస వేతనం రూ.26 వేలు, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వాలి
– ప్రభుత్వం స్పందించేంత వరకూ సమ్మె ఆగదు
– అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌, సిఐటియు నేతలు
ప్రజాశక్తి – నంద్యాల కలెక్టరేట్‌
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ నంద్యాల జిల్లా కేంద్రంలో అంగన్వాడీలు కదం తొక్కారు. నంద్యాల ఆర్డీఓ కార్యాలయంకు అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు భారీ ఎత్తున తరలివచ్చారు. తమ సమస్యలు పరిష్కరించేంత వరకూ సమ్మెను విరమింపజేసేది లేదని అంగన్వాడీలు స్పష్టం చేశారు. సోమవారం నంద్యాల ఆర్‌డిఒ కార్యాలయం వద్ద చేపట్టిన అంగన్వాడీల నిరసన దీక్షలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎ.నాగరాజు మాట్లాడారు. అంగన్వాడీల సమస్యల పరిష్కరించడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి వైఫల్యమయ్యారని విమర్శించారు. తల్లీ బిడ్డ, గర్భిణీలు ఆరోగ్యంగా ఉండాలంటే అంగన్వాడీలు ఎంతో ముఖ్యమని, అలాంటి అంగ న్వాడీల పట్ల సిఎం జగన్‌ మొండిగా వ్యవహరిస్తున్నారని అన్నారు. అంగన్వాడీలను బెదిరించాలని చూస్తే భయపడరని తెలుసుకోవాలన్నారు. అంగన్వాడీలను అణిచి వేయాలని చూడటం దుర్మార్గమైన చర్య అన్నారు. ఉద్యోగులను, కాంట్రాక్టు ఔట్సోర్సింగ్‌ సిబ్బందిని, అంగన్వాడీలను బెదిరించి పాలన చేయాలని చూస్తే సిఎం జగన్మోహన్‌ రెడ్డికి పుట్టగతులుండవని హెచ్చరించారు. అంగన్వాడీలు లక్షమందే అనుకుంటున్నా వారి కుటుంబాలలో దాదాపు పది లక్షల మంది ఓటర్లు ఉన్నారని సిఎంకు గుర్తు చేశారు. ఉద్యోగులకు, అంగన్వాడీలకు మధ్య చిచ్చు పెట్టాలని ప్రభుత్వం చూస్తుందని, ఆ ఆటలు సాగనివమన్నారు. అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి నిర్మల, జిల్లా ఉపాధ్యక్షురాలు డి.నిర్మల మాట్లాడుతూ ‘న్యాయమైన కోర్కెలు పరిష్కరించమంటే స్పందించరా..? అంగన్వాడీలను రోడ్లపైకి ఈడుస్తారా..? పిల్లలను ఎంతో భద్రంగా చూసుకుంటూ వారికి కావాల్సిన ఆహారం అందిస్తున్న అంగన్వాడీలపై ఎందుకు ఇంత వివక్ష చూపుతున్నారు..’ అని అన్నారు. సిఎం జగన్‌ పెంచింది వేయి రూపాయలు మాత్రమేనని, గత ప్రభుత్వం రూ.10 వేలకు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుత ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. సిఎం స్పందించకుంటే సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి.మద్దులు, జిల్లా నాయకులు వి.బాలవెంకట్‌, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు డి.లక్ష్మణ్‌, మహమ్మద్‌ గౌస్‌ మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామని పేరుకు మాత్రమే చర్చలు జరిపారు తప్ప, ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే మరోవైపు సచివాలయ ఉద్యోగులను, పోలీసులను పెట్టి కేంద్రాలను తెరిపించడం, తాళాలు పగలగొట్టడం దుర్మార్గమన్నారు. అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని విమర్శించారు. కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా నాయకురాళ్లు వెంకటలక్ష్మి, రాజ్యలక్ష్మి, సునీత, నాగరాణి, నాగమణి, పద్మ, సుజాత, ఉదయలక్ష్మి, మనోజ, సరస్వతి, డివిజన్‌ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

➡️