పెండింగ్‌ వేతనాలు ఇవ్వాలి

Jan 29,2024 21:23

కలెక్టరేట్‌ ముందు నిరసన తెలుపుతున్న స్వచ్ఛభారత్‌ కార్మికులు

పెండింగ్‌ వేతనాలు ఇవ్వాలి
– తొలగించిన స్వచ్ఛభారత్‌ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి
– సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా
ప్రజాశక్తి – నంద్యాల కలెక్టరేట్‌
స్వచ్ఛ భారత్‌ కార్మికులకు పెండింగ్‌ వేతనాలు ఇవ్వాలని, తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు వి.ఏసురత్నం, జిల్లా సహాయ కార్యదర్శి వి.బాలవెంకట్‌లు డిమాండ్‌ చేశారు. సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్‌ కార్మికులు నూనెపల్లె సెంటర్‌ నుండి కలెక్టర్‌ కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వచ్ఛభారత్‌ కార్మికులు గ్రామ పంచాయతీలలో వీధులను, మురికి కాలువలను శుభ్రం చేస్తూ, బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లుతూ, అంటువ్యాధులు వ్యాపించకుండా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజల ప్రాణాలను కాపాడుతున్నారని తెలిపారు. అధికారులకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవ చేస్తూ పని చేస్తున్నారని చెప్పారు. అటువంటి స్వచ్ఛభారత్‌ కార్మికులకు వేతనాలు 12 నుండి 22 నెలల వరకు వేతనాలు ఇవ్వకపోవడం దారుణమన్నారు. జిల్లా కలెక్టర్‌, జిల్లా పంచాయతీ అధికారి 14, 15వ ఫైనాన్స్‌ నిధులు వచ్చినప్పుడు ఆరు నెలల వేతనాలు ఇవ్వమని సర్క్యులర్‌ ఇచ్చినప్పటికీ ఏ ఒక్క ఎంపిడిఒ, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు కేవలం ఒకటి రెండు నెలలు వేతనం మాత్రమే ఇచ్చారని తెలిపారు. మిగతా నెలల వేతనాలు కార్మికులు అడిగితే పనులు మానుకోండని బెదిరిస్తున్నారని అన్నారు. జిల్లా కలెక్టర్‌, జిల్లా పంచాయతీ అధికారులు చొరవ చూపి వేతనాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. స్వచ్ఛభారత్‌ కార్మికులకు ఈఎస్‌ఐ, పిఎఫ్‌, గ్లౌజులు, చీపుర్లు, డ్రస్సులు, చెప్పులు, సబ్బులు, నూనె ఇవ్వాలని, చెత్త బండ్ల రిపేర్లు అధికారులే చేయించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 680 జీవో ప్రకారం నెలకు రూ. 10 వేలు ఇవ్వాలని, రాజకీయ వేధింపులు, అక్రమ తొలగింపులు ఆపాలని కోరారు. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం డిపిఒ మంజుల వాణికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛభారత్‌ కార్మికుల యూనియన్‌ నాయకులు దేవదాసు, త్యాగరాజు, నారాయణ, సుబ్బరాయుడు, హనుమంతు, శేఖర్‌, సామేలు, బాలన్న, మద్దిలేటి, స్వచ్ఛభారత్‌ కార్మికులు పాల్గొన్నారు.

➡️