పేదల ఆరోగ్యానికి మరింత భరోసా

Dec 18,2023 17:02

లబ్ధిదారులకు ఆరోగ్యశ్రీ కార్డులను అందజేస్తున్న జిల్లా కలెక్టర్‌, జడ్పీ చైర్మన్‌, ఎమ్మెల్యే కాటసాని తదితరులు

పేదల ఆరోగ్యానికి మరింత భరోసా
– కొత్త ఫీచర్లతో స్మార్ట్‌ ఆరోగ్యశ్రీ కార్డులు
– జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌
ప్రజాశక్తి – నంద్యాల కలెక్టరేట్‌
పేద ప్రజల ఆరోగ్యానికి మరింత భరోసా కల్పిస్తూ జిల్లాలో కొత్త ఫీచర్లతో కూడిన నూతన ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టామని జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ పేర్కొన్నారు. సోమవారం తాడేపల్లి సిఎం క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ కింద రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించడాన్ని, ప్రతి ఇంటికి వెళ్లి ఆరోగ్యశ్రీపై మరింత అవగాహన కల్పిస్తూ కొత్త ఫీచర్లతో స్మార్ట్‌ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ ప్రారంభం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని వర్చువల్‌ ద్వారా కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌, మైనారిటీ సంక్షేమ ప్రభుత్వ సలహాదారు హాబీబుల్లా, ఉమ్మడి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి, బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, జిల్లా ఎస్పీ కె.రఘువీర్‌ రెడ్డి, ఏపీఎస్పీడీసీఎల్‌ డైరెక్టర్‌ శశికళరెడ్డి, డిఎంహెచ్‌ఓ డాక్టర్‌ వెంకటరమణ, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్‌ డాక్టర్‌ రూపేంద్రనాథ్‌ రెడ్డి, డిసిహెచ్‌ఎస్‌ డాక్టర్‌ జఫ్రూళ్ళ, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వరప్రసాద్‌, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, లబ్ధిదారులు తదితరులు వీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్లి ఆరోగ్యశ్రీపై మరింత అవగాహన కల్పిస్తూ కొత్త ఫీచర్లతో స్మార్ట్‌ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీని చేపట్టామన్నారు. ఆరోగ్యశ్రీ యాప్‌ను ప్రతి ఒక్కరి సెల్‌ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేయించి రిజిస్ట్రేషన్‌ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. పేద ప్రజలు ఉచితంగా వైద్యం ఎలా చేయించుకోవాలి, ఎక్కడకు వెళ్లాలి, ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి, ఎవరిని అడగాలి అనే సందేహాలన్నింటికి వివరంగా ప్రతి ఇంటిలోనూ వివరించే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. మైనారిటీ సంక్షేమ ప్రభుత్వ సలహాదారు హాబీబుల్లా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్యాన్సర్‌ వంటి వ్యాధులకు ఎలాంటి పరిమితులు లేకుండా ఎంత ఖర్చయినా పూర్తి ఉచితంగా చికిత్స అందిస్తోందన్నారు. వీటిపై ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.1,897 కోటు వ్యయం చేసిందన్నారు. ఉమ్మడి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరోగ్యశ్రీలో చికిత్స తీసుకున్న రోగి పూర్తిగా కోలుకునే వరకు ఆరోగ్య ఆసరా కింద నెలకు రూ.5,000 చొప్పున ప్రభుత్వం అందిస్తోందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో పోస్టులు ఖాళీగా ఉండకుండా వైద్య సిబ్బందిని నియమించిందన్నారు. ఆరోగ్యశ్రీ కింద నెట్‌వర్క్‌ ఆసుపత్రుల సంఖ్యను గణనీయంగా పెంచిందన్నారు. వైద్యం ఖర్చు రూ.1000 దాటిన చికిత్సల వైద్య ప్రక్రియలు ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేరుస్తూ, చికిత్సల సంఖ్య 3,257కి పెంచినట్లు తెలిపారు. అనంతరం ముఖ్య అతిధులు లబ్ధిదారులకు కొత్త ఫీచర్లతో కూడిన నూతన ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేశారు.

➡️