శ్రీశైలంలో చిరుతపులి సంచారం

Dec 31,2023 18:16

గోడపై కూర్చుని ఉన్న చిరుత పులి

శ్రీశైలంలో చిరుతపులి సంచారం
– భయాందోళనలో స్థానికులు
ప్రజాశక్తి – శ్రీశైలం
శ్రీశైలంలో మరోసారి చిరుతపులి సంచరించింది. శనివారం రాత్రి రత్నానంద స్వామి ఆశ్రమం ప్రాంగణంలో హోమగుండం గోడపై చిరుత పులి కూర్చోని ఉండడాన్ని ఆశ్రమ వాసులు చూసి భయాందోళన చెందారు. వెంటనే ఫారెస్ట్‌ శాఖ సిబ్బందికి ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చారు. వెంటనే ఫారెస్ట్‌ సిబ్బంది అక్కడికి చేరుకొని టపాకాయలు పేల్చడంతో చిరుత పులి అడవిలోకి వెళ్లిపోయింది. అయితే అప్పుడప్పుడు స్థానికులకు దర్శనమిస్తున్న చిరుత పులి ఏ క్షణంలో ఎవరిపైన దాడి చేస్తుందోనని కొండ ప్రాంతానికి సమీపంలో ఉన్న శ్రీశైల వాసులు భయాందోళన చెందుతున్నారు. రెండు నెలల క్రితం టోల్‌గేట్‌ సమీపంలో ఉన్న దాసరివారి సత్రం కాంపౌండ్‌ గోడపై చిరుత పులి సంచరించింది. గతంలో తరచూ రెండు రోజులకు ఒకసారి చిరుతపులి కనబడుతూ రింగ్‌రోడ్‌లో దర్శనమిస్తూ ఉండేది. అలాగే తెలుగు యూనివర్సిటీ సమీపంలో చిరుత పులి, ఎలుగుబంట్ల సంచారం పెరగడంతో ప్రతిరోజు టపాకాయలు పేలుస్తూ అడవి జంతువులు ఆ ప్రాంతానికి రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. అటవీ శాఖ సిబ్బందికి యాత్రికుల నుండి వసూలు చేసే టోల్‌గేట్‌ రుసుముపై ఉన్నంత శ్రద్ధ అడవిపై, జంతువులపై శ్రద్ధ లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మనుషులు, వాహనాలు రోడ్లు దిగకుండా కంచ వెయ్యడం వంటి వాటిపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్న అటవీ శాఖ అధికారులు అడవి జంతువులు జనసంచారంలోకి రాకుండా, దాడి చేయకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు, ప్రయాణికులు, భక్తులు కోరుతున్నారు.

➡️