శ్రీశైలం జలాశయాన్ని పరిశీలించిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు

Jan 9,2024 21:45

ఆనకట్టను పరిశీలిస్తున్న ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు

శ్రీశైలం జలాశయాన్ని పరిశీలించిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు
ప్రజాశక్తి – శ్రీశైలం ప్రాజెక్ట్‌
శ్రీశైలం జలాశయాన్ని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు వైకె.హండ, వినోద్‌ వర్మలు మంగళవారం పరిశీలించారు. డ్రిప్‌ పథకం కింద నిధులు మంజూరు నిమిత్తం జలాశయాన్ని వారు సందర్శించారు. శ్రీశైలం ఆనకట్ట నిర్వహణ గురించి క్షుణ్ణంగా ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు సిడబ్ల్యూసి అధికారులు అతుల్‌ యాప, అఖిలేష్‌ కుమార్‌లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్యాలరీలోకి వెళ్లి డి వాటరింగ్‌ విధానాన్ని పరిశీలించారు. 2009 వరదల్లో దెబ్బతిన్న కుడిగట్టు కొండ చరియలు, రహదారులను పునరుద్ధరించాల్సి ఉందని సిడబ్ల్యుసి, శ్రీశైలం డ్యాం అధికారులు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు వివరించారు. ఆనకట్ట ముందు భాగంలో వున్న యాప్రాన్‌, ప్లంజ్‌ ఫూల్‌ను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రపంచ బ్యాంకు నిధులు 70 శాతం, రాష్ట్ర ప్రభుత్వం వాటా 30 శాతం నిధులు డ్రిప్‌ పథకానికి కేటాయించనున్నారు. ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం జరిగిందని, అందులో భాగంగా రూ. 149 కోట్లకు అంచనాలు పంపినట్లు ఇంజనీర్లు చెబుతున్నారు. వీరి వెంట సిఇ కబీర్‌ బాషా, ఎస్‌ఇ శ్రీరామచంద్ర మూర్తి, డ్యామ్‌ ఇఇ మనోహర్‌ రాజు, డిఇ శ్రీరాందాస్‌ మోహన్‌, ఎఇఇలు నరసింహ, సామ్యూల్‌ విజరు, మల్లికార్జున, చిట్టిబాబు ఉన్నారు.

➡️