సిఎం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

Dec 18,2023 17:09

ధర్నా చేస్తున్న అగ్రిగోల్డ్‌ బాధితులు, సిపిఐ నాయకులు

సిఎం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
– కలెక్టరేట్‌ ఎదుట అగ్రిగోల్డ్‌ బాధితులు ధర్నా
ప్రజాశక్తి – నంద్యాల కలెక్టరేట్‌
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి గత ఎన్నికలలో అగ్రిగోల్డ్‌ బాధితులకు డిపాజిట్‌ డబ్బులను ఇప్పిస్తానని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ అండ్‌ ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ గౌరవాధ్యక్షుడు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్‌ బాబా ఫక్రుద్దీన్‌, అసోసియేషన్‌ కార్యదర్శి ఎస్‌.రూబీన్‌లు డిమాండ్‌ చేశారు. సోమవారం అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌, ఏజెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నూనెపల్లె బ్రిడ్జి నుండి ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్‌కు చేరుకుని ధర్నా నిర్వహించారు. అనంతరం డిమాండ్‌తో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌ కార్యాలయంలోని స్పందన కార్యక్రమంలో డిఆర్‌ఒ పుల్లయ్యకు సమర్పించారు. అంతకు ముందు జరిగిన ధర్నాలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా నిలబడి డిపాజిట్‌ చేసిన 1183 కోట్ల రూపాయలు వడ్డీతో సహా అందరికీ కట్టించి పూర్తి న్యాయం చేస్తానని, మరణించిన కుటుంబానికి 10 లక్షల రూపాయలు పువ్వుల్లో పెట్టి ఇస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన సిఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఆ తర్వాత ఇచ్చిన హామీలను మరిచి అగ్రిగోల్డ్‌ బాధితులపైన సవతి తల్లి ప్రేమ చూపుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రసాద్‌, పట్టణ సహాయ కార్యదర్శి సోమన్న, జిల్లా సమితి సభ్యులు సామేలు, చెన్నయ్య, ఇన్సాప్‌ రాష్ట్ర సమితి సభ్యుడు జిలాని భాష, సిపిఐ నాయకులు, అగ్రిగోల్డ్‌ డిపాజిట్‌ బాధితులు పాల్గొన్నారు.

➡️