స్పందన సమస్యలకు సత్వర పరిష్కారం

Feb 12,2024 21:18

స్పందనలో వికలాంగురాలి వద్దకు వచ్చి సమస్య వింటున్న జిల్లా కలెక్టర్‌

స్పందన సమస్యలకు సత్వర పరిష్కారం
– జిల్లా కలెక్టర్‌ కె.శ్రీనివాసులు
ప్రజాశక్తి – నంద్యాల కలెక్టరేట్‌
స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలకు సత్వర పరిష్కారం చూపేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ కె.శ్రీనివాసులు జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని వైయస్సార్‌ సెంటినరీ హాల్లో స్పందన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి జిల్లా కలెక్టర్‌తో పాటు డిఆర్‌ఒ ఎ.పద్మజ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఏ ఒక్క దరఖాస్తు బియాండ్‌ ఎస్‌ఎల్‌ఏలోకి వెళ్లకుండా గడువులోపే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిష్కరించలేని సమస్యలకు సరైన కారణాలతో ఎండార్స్‌ ఇవ్వాలన్నారు. ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న హౌసింగ్‌, విద్య, వైద్యం, వ్యవసాయం, లేబర్‌ మొబలైజేషన్‌, డిఆర్డిఏ ద్వారా లబ్ధిదారుల సంక్షేమ పథకాలు తదితర అంశాల్లో నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీతకాల పరిమితిలోగా సాధించాలన్నారు. రానున్న ఎన్నికల నిర్వహణకు అధికారులకు అప్పగించిన పనులను ఇప్పటినుంచే పకడ్బందీ ప్రణాళిక రూపొందించుకుని ఆ మేరకు పనులు ప్రారంభించాలని ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో మొత్తం 164 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్‌కు అర్జీలు సమర్పించారు.ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కొన్ని వినతులు.. – ‘నాకు కానాల గ్రామంలో సర్వే నంబర్‌ 267-2లో 2.97 ఎకరాలు, నా కుమారుడికి సర్వే నంబర్‌ 267/2లో 1.75, 268/2లో 0.23 సెంట్లు పొలం ఉంది. వీటికి సంబంధించి అడంగల్‌ ఆన్‌లైన్‌లో చూపిస్తుంది కానీ 1బి ఆన్‌లైన్‌లో రావడం లేదు. 1బి ఆన్‌లైన్‌ చేయించగలరు’ అని నంద్యాల మండలం పాండురంగాపురం గ్రామ వాసి మాధవ రెడ్డి అర్జీ అందజేశాడు. – ‘ నా రేషన్‌ కార్డు అవుకు మండలం మంగంపల్లే గ్రామం అడ్రస్‌లో ఉంది.ఆ అడ్రస్‌ను జూలేపల్లి గ్రామానికి మార్చగలరు’ అంటూ గోస్పాడు మండలం జూలెపల్లి గ్రామ మహిళ నీలావతి దరఖాస్తు సమర్పించింది. – ‘ నేను డిగ్రీ వరకు చవుకున్నా. చదువుకునే సమయంలో కుష్ఠు వ్యాధికి గురై ఇప్పటివరకు బాధ పడుతున్నా. నాకు ఎలాంటి జీవనాధారం లేదు. నాకు ప్రభుత్వ కార్యాలయంలో ఏదైనా ఉద్యోగం ఇప్పించి ఆదుకోవాలి’ అని కోవెలకుంట్ల మండలానికి చెందిన మంజుల అర్జీ అందజేశారు.

➡️