హామీలు అమల చేయాలి

Dec 26,2023 16:45

అసిస్టెంట్‌ కమిషనర్‌ వెంకట దాస్‌కు వినతిపత్రం ఇస్తున్న మున్సిపల్‌ కార్మికులు

హామీలు అమల చేయాలి

– కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి
– ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి
– ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ డిమాండ్‌
– సమ్మెలోకి మున్సిపల్‌ కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు
ప్రజాశక్తి – నంద్యాల
కలెక్టరేట్‌ఎన్నికల ముందు పాదయాత్రలో జగన్‌ మోహన్‌ రెడ్డి మున్సిపల్‌ కాట్రాక్ట్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ గౌరవాధ్యక్షులు కె.మహమ్మద్‌ గౌస్‌, అధ్యక్ష కార్యదర్శులు ఎం.కృష్ణయ్య, బి.భాస్కరాచార్యులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నంద్యాల జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో పని చేస్తున్న ఉద్యోగులు కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం మంగళవారం సమ్మెలోకి వెళ్లారు. మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఉద్యోగులు నిరసన ధర్నా చేపట్టారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ నంద్యాల మున్సిపాలిటీలో అనేక ఏళ్లుగా పని చేస్తున్న ఉద్యోగులకు కనీస వేతనం అమలు చేయడం లేదన్నారు. సిఎం జగన్మోహన్‌ రెడ్డి ఎన్నికల ముందు అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తామని హామీనిచ్చ్చి అధికారం చేపట్టాక విస్మరించారన్నారు. తక్షణమే రెగ్యులర్‌ చేయాలని, కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. మునిసిపాలిటిలోని పర్మినెంట్‌, ఇంజనీరింగ్‌, పారిశుధ్య, క్లాప్‌ డ్రైవర్స్‌ విభాగాలలో పని చేస్తున్న ఉద్యోగులు, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులందరి సమస్యలు పరిష్కరించాలన్నారు. మున్సిపల్‌ కార్మికులందరికి ఏపిసిఒఎస్‌ నుండి మినహాయింపు ఇవ్వాలన్నారు. జిఒ 7 ప్రకారం కనీస విద్యా అర్హత, సీనియారిటి ప్రాతిపదికన అర్హత కలిగిన ఇంజనీరింగ్‌ కార్మికులకు స్కిల్డ్‌, సెమి స్కిల్డ్‌ వేతనాలు చెల్లించాలన్నారు. రూ.6 వేలు హెల్త్‌, రిస్క్‌ అలవెన్సులు చెల్లించాలన్నారు. కార్మికులందరికీ పనిముట్లు, రక్షణ పరికరాలు ఇప్పించాలన్నారు. ఇళ్ళ స్థలాలు, ఇళ్ళు కట్టించి ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. విరమణ వయసు 62 ఏళ్లకు జిఒ అమలు చేయాలని కోరారు. లేనిపక్షంలో ఆందోళన ఉధతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం అసిస్టెంట్‌ కమిషనర్‌ వెంకట దాసుకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో నాయకులు రామకృష్ణ, ఆదామ్‌, పవన్‌ కుమార్‌, రామాంజనేయులు, కరిముల్లా, రాజు, కర్ణ, కుమార్‌, ఈశ్వరయ్య, మురళి, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ మున్సిపల్‌ ఉద్యోగులు పాల్గొన్నారు.

➡️