అపెరల్‌ పార్కు ఏదీ?

Apr 3,2024 21:43

ప్రజాశక్తి-రేగిడి : రాజాం నియోజకవర్గంలోని రేగిడి మండలం గుల్లపాడు గ్రామపంచాయతీ పరిధి కొండల మామిడి వలస (ఉంగరాడమెట్ట) వద్ద అపెరల్‌ పార్కు (టెక్స్‌టైల్స్‌ పరిశ్రమ) ఏర్పాటుకు వేసిన శిలాఫలకం నిరుద్యోగులను ఎక్కిరిస్తోంది. అపెరల్‌ పార్క్‌ నిర్మాణం కోసం అప్పటి టిడిపికి చెందిన రాష్ట్ర విద్యుత్‌శాఖా మంత్రి, ప్రస్తుత స్పీకర్‌ తమ్మినేని సీతారాం 2000 సంవత్సరంలో శిలాఫలకం వేశారు. ఆగమేఘాలపై రెవెన్యూ అధికారులకు 10ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించి నివేదికలు పంపించాలని ఆదేశాలు కూడా ఇచ్చారు. రెవెన్యూ అధికారులు సర్వేలు చేసి ప్రజా ఆమోదం తీసుకున్నారు. ఇక్కడ అపెరల్‌ పార్క్‌ నిర్మాణం చేపడితే వేలమంది నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి కలుగుతుందని అప్పటి టిడిపి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మంత్రి తమ్మినేని సీతారాం నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఆ హామీని గాలికి వదిలేశారు. ప్రస్తుత వై సిపి ప్రభుత్వం ఆ పరిశ్రమ ఊసే ఎత్తలేదు. పైగాఈ స్థలాన్ని జగనన్న కాలనీకి రెవెన్యూ అధికారులు బదిలీ చేశారు. దీంతో అపెరల్‌ పార్కు నిర్మాణం లేక వేలాదిమంది నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి కరువైంది. దీంతో విశాఖ, చెన్నై, ముంబై, కోల్‌కత్తా, ఒడిశా, మధ్యప్రదేశ్‌, తెలంగాణ వంటి రాష్ట్రాలలో పనులు కోసం వలస వెళ్లిపోతున్నారు. ప్రభుత్వాలు మారిన నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకపోవడంతో వారంతా ఆవేదన చెందుతున్నారు. ఉపాధి కోసం ఎదురుచూపులురాజాం నియోజకవర్గంలో రేగిడి, సంతకవిటి, వంగర, రాజాం మండలాల్లో 120 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఈ గ్రామాలకు చెందిన వందలాది మంది యువకులు ఉన్నత చదువులు చదివి నిరుద్యోగులుగా ఉన్నారు. ఇక్కడ టెక్స్‌టైల్స్‌ పరిశ్రమ ఏర్పాటు చేస్తే ఉపాధి పొందిన కుటుంబాలకు చేదోడువాదోడిగా ఉంటామను కున్న నిరుద్యోగుల ఆశలు అడియాశలయ్యాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి అపెరాల్‌ పార్కు నిర్మాణం కోసం నిధులు కేటాయించి నిరుద్యోగ సమస్యను అధిగమించేలా చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. ఉపాధి లేక వలసలు ఉన్నత చదువులు చదివినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగం రాక, ఉపాధి లేక వలస బాట పడుతున్నాం. ఇక్కడ అపెరల్‌ పార్కు నిర్మాణం చేపడితే నిరుద్యోగ సమస్య కొంతయినా తీరుతుంది. ఉపాధి కోసం ఎదురు చూస్తున్నాం. ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలి.వాల్తేటి రవికుమార్‌, కొమిరి గ్రామం ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు కొండల మామిడి వలస సమీపాన ప్రభుత్వ స్థలంలో టెక్స్‌టైల్స్‌ పరిశ్రమ నిర్మాణం కోసం అప్పటి టిడిపి ప్రభుత్వం శంకుస్థాపనచేసి 24 ఏళ్లయ్యింది. ఆ తరువాత వైసిపి అధికారం చేపట్టినప్పటికీ పట్టించుకోలేదు. దీనిపై స్థానిక ప్రజాప్రతినిధులకు శ్రద్ధ లేదు. ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేస్తే నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుంది. మా గ్రామం సమీపంలో కొత్త పరిశ్రమ వస్తే చదువుకున్న తమకు ఉద్యోగవకాశాలు వస్తాయని ఆశపడ్డాం. కానీ మా ఆశ నెరవేరలేదు. వచ్చే కొత్త ప్రభుత్వమెనా అపెరల్‌ పార్కు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలిచింతాడ గణేష్‌, రేగిడి

➡️