ఖరీఫ్‌కు సన్నద్ధత ఏదీ?

May 23,2024 20:52

 విత్తనాలు, ఎరువులపై భరోసా ఇవ్వని అధికారులు

ప్రణాళికపై సమావేశాలూ కరువే

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  : ఖరీఫ్‌ సీజన్‌ మరోవారంలో వచ్చేస్తుంది. మునుపెన్నడూ లేని విధంగా ఈనెలాఖరు నాటికే రుతుపవనాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం చెబుతోంది. కొద్దిరోజులుగా జిల్లాలో అక్కడక్కడా వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఎండతీవ్రత ఎక్కువగానే ఉన్నప్పటికీ అడపాదడపా కురిసిన వర్షాలు కాస్త ఉపశమనం కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఎండకు వేడెక్కిన భూములు కొద్దిరోజులుగా చల్లబడ్డాయి. అంతా అనుకూలిస్తే జూన్‌ మొదటివారం నుంచే దుక్కులు వేసుకునేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటువంటి సమయంలో ఖరీఫ్‌ పంటల ప్రణాళిక తెలియజేసి రైతులకు అండగా ఉంటామన్న సాంకేతాలివ్వాల్సిన వ్యవసాయ శాఖ అధికారులు అటువంటి ప్రయత్నాలేవీ చేయడం లేదు. దీంతో, రైతుల్లో అయోమయ పరిస్థితి నెలకుంది. విజయనగరం జిల్లాలో సాధారణంగా జూన్‌లో రుతపవనాలు వస్తాయి. ఇందుకు ముందుగానే అధికారులు పంటల వారీ సాగు విస్తీర్ణం, విత్తనాలు, ఎరువులు, వాటిపై ప్రభుత్వం ప్రకటించిన సబ్సిడీ వంటి గణాంకాలు సిద్ధం చేస్తారు. ఇందుకనుగుణంగా ప్రభుత్వం నుంచి రప్పించేందుకు అధికారులు కసరత్తుచేసి రాష్ట్ర కేంద్రానికి నోట్‌ఫైల్‌ పంపుతారు. దీనికి ముందుగా జిల్లా కలెక్టర్‌ లేదా జాయింట్‌ కలెక్టర్‌ సమక్షంలో సమావేశాలు నిర్వహించి ప్రణాళిక సిద్ధం చేస్తారు. కానీ, ఈ ఏడాది ఖరీఫ్‌పై అటువంటి సన్నద్ధత ఏమీ కనిపించడం లేదు. వాస్తవానికి విజయనగరం పూర్తిగా వ్యవసాయ ఆధారిత జిల్లా. సాగునీటి వనరులు పెద్దగా లేకపోవడంతో ఖరీఫ్‌ సీజన్‌ మాత్రమే జీవనాధారం. వరి, మొక్కజొన్న, చెరకు, పత్తి, నువ్వులు, వేరుశెనగ తదితర వ్యవసాయ పంటలు సుమారు 4,94,455 ఎకరాల్లో సాగవుతాయి. మరో 1,49,162 ఎకరాల్లో రకరకాల కూరగాయాలు, టమాట, ఉల్లి, పువ్వులు, ఆయిల్‌ ఫామ్‌ వంటి ఫుడ్‌ అండ్‌ నాన్‌ఫుడ్‌ ఉద్యాన పంటలు సాగవుతాయి. రైతు కుటుంబాల మనుగడకు ఖరీఫ్‌ సీజన్‌ అత్యంత కీలకమైనది. 2022-23 ఖరీఫ్‌ సీజన్‌లో 2,90,476 ఎకరాల్లో వివిధ రకాల వ్యవసాయ పంటలు సాగయ్యాయి. ఈ ఏడాది (2023-24) 3,03,102 ఎకరాల్లో సాగు కావచ్చని అధికారులు అంచనాలు రూపొందించగా, సీజన్‌ ఆఖరునాటికి శతశాతం విస్తీర్ణంలో పంటలు సాగయినట్టు లెక్కలు చూపించారు. ఇందులో అత్యధికంగా వరి 2,34,112 ఎకరాలకు గాను 99శాతం నాట్లు పడినట్టు అధికారులు లెక్కలు చూపించారు. ఈఏడాది 2,35,000 ఎకరాల్లో నాట్లు వేసేందుకు అధికారులు అంచనాలు చూపిస్తున్నప్పటికీ, ఎక్కడెక్కడ ఏయే రకాలు విత్తనాలు ఎంతెంత అవసరమౌతాయనే లెక్కలు ఇప్పటికీ అధికారులు తేల్చలేదు. భూసారం, నీటి లభ్యతను బట్టి సోనామసూరి (బిపిటి 3291), సాంబమసూరి (బిపిటి 5204), అమర (ఎంటియు 1064), అత్యల్పంగా సూపర్‌ ప్రైమ్‌ కొత్తరకం వెరైటీ (ఎంటియు 1318), రాగోలు సన్నాలు (ఆర్‌జిఎల్‌ 2573) వంటి ఏడు రకాల వరి విత్తనాలను ప్రభుత్వం తరపున సబ్సిడీపై పంపిణీ చేశారు. మారుతున్న వాతావరణ పరిస్థితులు, వాటి ఆధారంగా వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనల మేరకు ఏటా విత్తన ప్రోత్సాహంలో తేడా ఉంటుంది. వీటి ఆధారంగా రైతులకు పెట్టుబడిలోనూ హెచ్చతగ్గులు ఉంటాయి. కానీ, సీజన్‌ ముంచుకొచ్చినప్పటికీ విత్తన ప్రాధాన్యతపై వ్యవసాయ శాఖ తరపున రైతులకు సూచనలు, సలహాలు ఇవ్వ లేదు. వరి తరువాత మొక్కజొన్న 35,055 ఎకరాలు, నువ్వులు 16,257 ఎకరాలు, చెరకు 15,040 ఎకరాలు, పత్తి 6,707 ఎకరాలు, వేరుశనగ 1487 ఎకరాలు, రాగులు 122 ఎకరాలు ఎకరాల్లో సాగవుతాయని అంచనాలు రూపొందించారు. మినుములు, పెసలు, కందులు తదితర అపరాలు కూడా 400 ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉంది. ఈ పంటల కోసం ప్రభుత్వం తరపున విక్రయిచబోయే విత్తనాలు, ఎరువులు, వాటిపై ప్రభుత్వం ఇవ్వబోయే సబ్సిడీ తదితరాలపై ఇప్పటికీ అధికారులు క్లారీటీ ఇవ్వకపోవడం పట్ల రైతుల్లో ఆందోళన వ్యక్తమౌతోంది. ఇదే విషయమై జిల్లా స్థాయిలో కనీసం అధికారిక సమావేశాలు కూడా జరగకపోవడం గమనార్హం.

➡️