అంత సులువు కాదు!

May 6,2024 21:16

ప్రజాశక్తి – పూసపాటిరేగ: నెల్లిమర్ల నియోజకవర్గంలో గెలుపెవరదన్నది గతంలో సునాయాసంగా అంచనాలు వేసేవారు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో తూర్పుకాపు ఓటు బ్యాంకు సుమారుగా 45 శాతం ఉంది. దాంతో ఈ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేసినా తూర్పుకాపు సామాజిక వర్గం అభ్యర్ధి మాత్రమే గెలుస్తాడన్నది జగమెరిగిన సత్యంగా మారింది. రాజకీయ పార్టీల అధినేతలు ఈ నియోజకవర్గం గురించి సర్వేలు చేయించుకొని చివరికి తూర్పుకాపుకే టికెట్‌ కేటాయింపులు చేసి విజయం అందుకోవడం పరిపాటి. అయితే ఈ సారి కూడా నియోజకవర్గం నుండి తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన సిట్టింగ్‌ ఎమ్మేల్యే బడ్డుకొండ అప్పలనాయుడుకు వైసిపి సీటు కేటాయించింది. టిడిపి కూడా తూర్పు కాపు అభ్యర్ధి కర్రోతు బంగారాజును సిద్దం చేసింది. అయితే రాజకీయ సమీకరణలు నేపథ్యంలో నియోజక వర్గం నుంచి అనూహ్యంగా జనసేనకు టికెట్‌ కేటాయించాల్సిన అవసరం ఏర్పడింది. అయితే జనసేన మరో బలమైన (తెలగా) సామాజిక వర్గానికి చెందిన లోకం మాధవిని అభ్యర్ధిగా నిలబెట్టింది. నియోజకవర్గంలో టిడిపి కాపు సామాజిక వర్గమంతా ఇప్పుడు లోకం మాదవితో ఉన్నారు. మరో బలమైన తెలగా సామాజిక వర్గం నాయకుడు కందులు రఘుబాబు వైసిపికి మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో ఈ సారి వైసిపి, కూటమి అభ్యర్థులు మద్య నువ్వానేనా అన్న పోటీ నెలికొంది. ఈ సారి గెలుపు అంచనాలు వేయడం అంత ఈజీ కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ సారి నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న కాపులు ఎవరికి కాపుకాస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ ఎన్నికలతో కాపుల కోటకు బీటలా..? పధిలమా..? తేలిపోనుంది. ఐదు దశాబ్దాలుగా వారిదే గెలుపురాజకీయంలోకి కుల సమీకరణలు తెరపైకి రాకముందు ఈ నియోజకవర్గం అంటే ఒకప్పటి భోగాపురం నియోజకవర్గం నుంచి తెలగా కులానికి చెందిన కొమ్మూరి అప్పడుదొర వరుసగా 5 సార్లు విజయం సాదించారు. 1983 నుండి రాజకీయంలోకి కుల సమీకరణలు తెరపైకి వచ్చాయి. దాంతో తూర్పు కాపు సామాజిక వర్గం అభ్యర్ధిగా పోటీలో ఉన్న పతివాడ నారాయణ స్వామినాయుడు ఏకంగా ఏడు సార్లు విజయం సాదించారు. మద్యలో అదే సామాజిక వర్గానికి చెందిన బడ్డుకొండ అప్పలనాయుడు రెండు సార్లు విజయం సాదించారు. అంటే దాదాపుగా 1983 నుండి ఇప్పటి వరకూ 50 సంవత్సరాలు పాటు తూర్పు కాపు సామాజిక వర్గానికే ఇక్కడ ప్రజలు పట్టం కట్టారంటే నియోజకవర్గంలో కులం కార్డు ఏ విదంగా పనిచేస్తుందో చెప్పాలిసన అవసరం లేదు. సంప్రదాయం కొనసాగేనా?ఈ సారి నియోజకవర్గంలో బలమైన సామాజిక వర్గాలుగా ఉన్న కాపు, తెలగా నుంచి అభ్యర్థులు పోటీలో ఉన్నారు. గతం మాదిరి అయితే కాపు అభ్యర్ధిదే విజయం సాధిస్తారన్నది తెలిసిందే. అయితే ఈ సారి టిడిపికి సంబందించిన నాలుగు మండలాల కాపు సామాజిక వర్గంలో దాదాపుగా సగం మంది కూటమి అభ్యర్ధి లోకం మాధవి వైపు సపోర్ట్‌ చేస్తున్నారు. మరో బలమైన తెలగా సామాజిక వర్గానికి చెందిన కంధుల రఘుబాబు వైసిపికి మద్దతుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో గెలుపు ఎటువైపు ఉంటుందన్నది అంచానాలు వేయలేని స్ధితి నెలకొంది. దీంతో ఇరువురు అభ్యర్దులు తమ సొంత కులం కార్డును తెరపైకి తెచ్చారు. ఏది ఏమైనా నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న కాపులు ఎవరికి కాపుకాస్తే వారిదే విజయం అన్నది రాజకీయ మేధావులు చెబుతున్నారు. మరి ఈ సారి కాపులు ఎవరికి కాపుకాస్తారోనన్న చర్చ జరుగుతోంది.

➡️