ఇకపై ఆ దారిన అందరూ వెళ్లొచ్చు!

Jun 17,2024 23:35

ప్రజాశక్తి-తాడేపల్లి : తాడేపల్లిలోని మాజీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి నివాసానికి వెళ్లే రోడ్డు మూడంచెల భద్రతతో కూడుకుని ఉంటుంది. బయట వారు ఎవరూ ఆ మార్గం గుండా వెళ్లలేని పరిస్థితులు. మంత్రులు, ఉన్నత అధికారులు, ఎమ్మెల్యేలు మినహా ఆ రోడ్డువైపు మరొకరు వెళ్లలేని పరిస్థితి. ఇది నిన్నటిదాకా. నేడు పరిస్థితి మారిపోయింది. ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వం ఓడిపోవడంతో జగన్‌ ఇంటి వద్ద పోలీస్‌ భద్రతను తగ్గించారు. రోడ్డుపై అందరికీ రాకపోకలకు అవకాశం కల్పించారు. ప్రభుత్వం పోలీసు భద్రత కూడా ఎత్తివేసింది. చెక్‌పోస్టుల వద్ద బారీకేడ్‌లను కూడా తొలగించారు. గతంలో అమరారెడ్డికాలనీ పేరుతో బకింగ్‌ హోమ్‌ కాల్వ పంపింగ్‌ స్కీమ్‌ నుంచి అరవింద స్కూల్‌ వరకు వందలాది మంది పేదలు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. సిఎం నివాసం ఇక్కడ ఏర్పాటైన తరువాత అక్కడున్న ఇళ్లను మొత్తం తొలగించారు. దీనికి బదులుగా ఆత్మకూరు వద్ద ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి నిధులు కేటాయించారు. గతంలో సీతానగరం నుంచి బకింగ్‌ హోమ్‌ కాల్వ మీదుగా రేవేంద్రపాడు వరకు వెళ్లే ఈ కట్టను తాడేపల్లి బ్రిడ్జి నుంచి కుంచనపల్లి ఆంధ్రరత్న పంపింగ్‌ స్కీమ్‌ వరకు డబుల్‌ లైన్‌ రోడ్డు చేశారు. పాత కట్ట రోడ్డును అలాగే ఉంచారు. డబుల్‌ లైన్‌ రోడ్డు పక్కన భారీ ఎత్తున ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు. గ్రీనరీ అభివృద్ధి చేశారు. ఈ దారిపై వాహనాల రాకపోకలు యథావిధిగా కొనసాగించడంతో అరవింద హైస్కూల్‌ తదితర పాఠశాలలకు వెళ్లే బస్సులతో పాటు రేవేంద్రపాడు వరకు వెళ్లే వాహనదారులకు 1.5 కిలోమీటర్ల దూరం కలిసి వస్తుంది. మరోవైపు జగన్‌ నివాసం చూడటంతో పాటు కాల్వ కట్ట వెంట వేసిన గ్రీనరీ చూడటానికి స్థానికులు తరలివస్తున్నారు. జగన్‌ ఇంటి ముందు సెల్ఫీలు దిగుతున్నారు. ఉదయం పూట నడక కొనసాగించే వారికి కూడా ఈ దారి వినియోగించే వీలుంది. ఈ రోడ్డులో ఉన్న అపార్టుమెంట్‌ వాసులు కూడా గతంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొని నేడు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

➡️