కోరం లేక మండల పరిషత్‌ సమావేశం వాయిదా

May 20,2024 20:16

 ప్రజాశక్తి – ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం మండల పరిషత్‌ సమావేశం సోమవారం కోరం లేక వాయిదా పడింది. ఈ సమావేశాన్ని వైసీపీ ఎంపీటీసీలు బహిష్కరించడం తో సమావేశంలో కోరం సరిపోలేదు. ఇటీవల ఎంపీపీ పాలడుగు జ్యోత్స్న వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. ఎంపీపీ పార్టీ మారిన తరువాత మొదటి మండల సమావేశం సోమవారం జరిగింది. వైసీపీలో గెలిచి టీడీపీలో చేరినందుకు నిరసనగా సమావేశాన్ని వైసీపీ ఎంపీటీసీలు బహిష్కరించినట్లుగా తెలుస్తుంది. దీంతో కోరం లేక మండల పరిషత్‌ సమావేశం రెండు సార్లు వాయిదా పడింది. ఇక చేసేది లేక ఎంపీడీవో వి.ఉమాదేవి ఇబ్రహీంపట్నం మండల పరిషత్‌ సమావేశం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తదుపరి సమావేశం ఎప్పుడో ప్రకటిస్తాం అన్నారు. సమావేశానికి గైర్హాజరైన ఎంపీటీసీ సభ్యులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తెలిపారు. కో – ఆప్షన్‌ సభ్యుడు సమావేశానికి హాజరు కాలేనని ముందుగానే సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. సమావేశానికి ఎంపీపీ పాలడుగు జ్యోత్స్న, వైస్‌ ఎంపీపీ – 1 బండి నాగమణి, తుమ్మలపాలెం ఎంపీటీసీ పోలిశెట్టి తేజ హాజరయ్యారు. తాను పార్టీ మారినందువల్లే వైసీపీ ఎంపీటీసీలు సమావేశం బహిష్కరిస్తున్నారన్న విషయం తన దృష్టికి రాలేదని ఎంపీపీ జ్యోత్స్న తెలిపారు.

➡️