అవినీతిని నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాలకు దూరం:సామినేని

Apr 10,2024 22:11

ప్రజాశకి – జగ్గయ్యపేట : తనపై చేసిన ఆరోపణలు ఆధారాలతో నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటానని రాష్ట్ర ప్రభుత్వ విప్‌, స్థానిక శాసనసభ్యులు సామినేని ఉదయభాను అన్నారు. తనపై చేసిన ఆరోపణలకు బహిరంగ చర్చకు తాను సిద్ధమన్నారు. ఓ పత్రికలో తనపై వచ్చిన తప్పుడు కథనంపై బుధవారం ఆయన పట్టణంలోని వైసిపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈసందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ తనపై 2014, 2019 ఎన్నికల సమయంలో ఎల్లో మీడియా అసత్యాలతో కథనాలు రాసిందన్నారు. ఇప్పుడు కూడా అలానే రాస్తోందన్నారు. గత ఐదేళ్లలో తాను అక్రమాలకు పాల్పడితే ఆ సమయంలో కథనాలు రాయకుండా ఎన్నికల సమయంలో మాత్రమే తనపై తప్పుడు ఆరోపణలతో కథనాలు రాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఎన్నికల్లో దెబ్బతీసేందుకే ఎల్లో మీడియా ప్రయత్నిస్తోందని విమర్శించారు. తాను నిజంగా తప్పులు చేస్తే నిష్పక్షపాతంగా కథనాలు రాయొచ్చని, కానీ ప్రత్యేకించి ఎన్నికల సమయంలో తనను దెబ్బతీసేందుకు కథనాలు రాస్తూ రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. ఓ పత్రిక రెండు నెలల క్రితం తనపై తప్పుడు ఆరోపణలతో కథనం రాసిందని, దానికి తాను కౌంటర్‌ ఇస్తే ఇంతవరకు ప్రచురించకపోవడం దారుణమని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అభివద్ధి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డిని, వైసిపి ఎంఎల్‌ఎలను లక్ష్యంగా చేసుకుని కొన్ని పత్రికలు కథనాలు రాస్తున్నాయని విమర్శించారు. కానీ మద్యం, బియ్యం, గుట్కా, గంజాయి, మట్టి మాఫియా అంటూ తనపై కథనాలు రాసిన ఆయా పత్రికలకు కోర్టు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రజా సంక్షేమాన్ని కోరుకునే తనపైన, తన కుమారుడు, తన సతీమణి, తన వియ్యంకుడిపైనా ఆరోపణలు చేస్తూ అవినీతిని అంటగట్టడం మానుకోవాలన్నారు. ద మ్మూ, ధైర్యం ఉంటే మరో రెండు రోజుల్లో చర్చకు రావాలని ఆయన సవాల్‌ విసిరారు.

➡️