25 నుండి నగరంలో ఇంటర్నేషనల్‌ ఫిడే చెస్‌ టోర్నీ

Apr 15,2024 22:19

ప్రజాశక్తి – ఎడ్యుకేషన్‌ : స్పార్క్‌ చెస్‌ అకాడమి ఆధ్వర్యంలో ఈనెల 25 నుండి 30వ తేదీ వరకు కానూరులోని షామ్‌రాక్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ నందు మొదటి ఇంటర్నేషనల్‌ ఓపెన్‌ ఫిడే రేటింగ్‌ చెస్‌ టోర్నమెంట్‌ – 2024 నిర్వహించనున్నట్లు స్కూల్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ భారతి దర్‌ తెలిపారు. కానూరులోని స్కూల్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో చెస్‌ టోర్నమెంట్‌కు సంబంధించి పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం ఉదయం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో తొలిసారిగే జరిగే ఫిడే ఇంటర్నేషనల్‌ చెస్‌ టోర్నమెంట్‌కు తమ స్కూల్‌ ఆతిథ్య మివ్వడం ఆనందంగా ఉందని తెలిపారు. పూర్తిస్థాయి ఎయిర్‌ కండీషన్‌ హాల్‌లో పోటీలు జరుగుతాయని అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పోటీలలో పాల్గొనే క్రీడాకారులకు ఉచిత భోజన సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు. 400 మందికిపైగా క్రీడాకారులు పాల్గొననున్నారని ఇప్పటికే 300 మంది రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని తెలిపారు. శ్రీలంక, జింబాబ్వే, బంగ్లాదేశ్‌, అమెరికాతో పాటు ఇండియా నుండి ప్రముఖ చెస్‌ క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు. పది రౌండ్లలో పోటీలు జరుగుతాయని తెలిపారు. విజేతలకు 51 నగదు బహుమతులు, 103 ట్రోఫీలు ఉంటాయని మొత్తం రూ.5 లక్షలు నగదు బహుమతులు ఉంటాయన్నారు. చెస్‌ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ఈనెల 20వ తేదీలోగా ఎంట్రీలను పంపవచ్చని తెలిపారు. గడువు తేదీ తరువాత ఈనెల 24వ తేదీ వరకు రు. 500లు అదనపు రుసుముతో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవచ్చని తెలిపారు. చెస్‌ గ్రాండ్‌ మాస్టర్‌, ఉమెన్‌ గ్రాండ్‌ మాస్టర్‌, ఇంటర్నేషనల్‌ మాస్టర్‌, ఉమెన్‌ ఇంటర్నేషనల్‌ హాస్టర్స్‌కు పోటీల్లో పాల్గొనేందుకు ఎటువంటి ప్రవేశ రుసుం లేదని ఇతరులకు నామమాత్రమపు రుసుము ఉంటుందని తెలిపారు. టోర్నమెంట్‌కు చీఫ్‌ ఆర్భిటర్‌గా ఇంటర్నేషనల్‌ ఆర్భిటర్‌ జి.వి.కుమార్‌ వ్యవహరిస్తారని తెలిపారు. పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో విజయవాడ చెస్‌ మాస్టర్‌ ఎ.రామకృష్ణ, చెస్‌ కోచ్‌ ప్రవీణ్‌ పాల్గొన్నారు.

➡️