కెబిఎన్‌ కళాశాలకు నాక్‌ ఎ డబుల్‌ ప్లస్‌ గ్రేడ్‌

Apr 13,2024 22:30

ప్రజాశక్తి – వన్‌టౌన్‌ : కాకరపర్తి భావనారాయణ కళాశాల యూజీసీ అనుబంధ సంస్థ నాక్‌ నుంచి ఏ డబుల్‌ ప్లస్‌ గ్రేడ్‌ను సాధించిందని ఎస్‌కేపీవీవీ హిందూ హైస్కూల్స్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి గోపిశెట్టి మల్లయ్య, ఆ కళాశాల అధ్యక్ష, కార్యదర్శులు తొమ్మండ్రు శేషయ్య, తూనికుంట్ల శ్రీనివాసులు చెప్పారు. ఈ సందర్భంగా ఆ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఎస్‌కేపీవీవీ హిందూహైస్కూల్స్‌ కమిటీ ఆధ్వర్యంలో 1965లో కేబీఎన్‌ కళాశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. 59 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉన్నత విద్యారంగ వ్యాప్తికి తద్వారా సామాజిక వికాసానికి కేబీఎన్‌ కళాశాల అద్వితీయమైన సేవలందిస్తుందని వివరించారు. అదే క్రమంలో అనేక మైలురాళ్లను దాటుకుంటూ నేడు ఆరు వేల మంది విద్యార్థులు రాష్ట్రంలో అతి పెద్ద కళాశాల్లో ఒకటిగా ఘనతకెక్కిందన్నారు. కళాశాలలోని అన్ని అంశాలను పరిశీలించి తగిన గ్రేడింగ్‌ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్‌ అసిస్మెంట్‌ అండ్‌ అక్రిడిటేషన్‌ (నాక్‌) పని చేస్తుందన్నారు. ఈ సంస్థ యూనివర్శిటీ గ్రాంట్‌ కమిషన్‌ అనుబంధంగా కొనసాగుతుందన్నారు. నాక్‌ సంస్థ నియమించిన బందం ఫిబ్రవరి మాసంలో రెండు రోజుల పాటు తమ కళాశాలకు విచ్చేసి పరిశీలన చేసి వెళ్లిందన్నారు. ఆ క్రమంలో నాక్‌ అందించే అత్యుత్తమ గ్రేడ్‌ ”ఏ డబుల్‌ ప్లస్‌” ను తమ కళాశాలకు ప్రకటించిందన్నారు. ఏఏ అంశాలకు ఏ విధమైన మార్కులను కేటాయించినది అనే పూర్తి వివరాలతో నాక్‌ వెబ్‌సైట్‌లో వివరాలను పొందిపరిచిందని వివరించారు. ఈ సమావేశంలో హిందూహైస్కూల్స్‌ కమిటీ కోశాధికారి గోళ్ల బాబావిజయకుమార్‌ కళాశాల కోశాధికారి అన్నం రామకృష్ణారావు, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వి.నారాయణరావు, వైస్‌ ప్రిన్సిపాల్స్‌ డాక్టర్‌ ఎం.వెంకటేశ్వరరావు, పిఎల్‌ రమేష్‌, డాక్టర్‌ కె.రామకృష్ణ, ఐక్యూఏసీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ జీ కష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

➡️