ప్రజా సమస్యలు విస్మరించిన నేతలు

May 22,2024 21:32
  • సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు

ప్రజాశక్తి – అజిత్‌ సింగ్‌నగర్‌ : రాష్ట్రంలో హింస, సవాళ్లలో నిమగమైన నేతలు ప్రజల సమస్యలు విస్మరించారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు అన్నారు. దేశ ప్రధాని మోడీ విద్వేషాలను, మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టడం అమానుషమన్నారు. సిపిఎం ప్రజలను అంటి పెట్టుకొని, ప్రజా ఎజెండాను ముందుకు తెస్తుందన్నారు. బుధవారం 58వ డివిజన్‌ సింగ్‌ నగర్‌ ప్రాంతంలో ఆయన సిపిఎం నాయకులతో కలిసి పర్యటించారు. ఇంటింటికీ తిరిగారు. ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. డ్రెయిన్‌లు పొంగిపొర్లుతున్నా, పారిశుధ్యం దెబ్బతింటున్నా, చెత్త వాహనాల డ్రైవర్లు సమ్మెలో ఉన్నా, అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోవటం లేదని ప్రజల తమ గోడు వెళ్ళబుచ్చారు. సంక్షేమ పథకాల లబ్ధి చేకూరడం లేదని వాపోయారు. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ ప్రధాని మోడీ అసహనంతో విద్వేషాలను రగుల్చుతున్నారన్నారు. మతాల మధ్య చిచ్చు రేపుతూ ఉపన్యాసాలు చేస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం దేశ ఐక్యతను దెబ్బతీస్తున్నారు. బహిరంగ ప్రకటనలతో రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కల్పిస్తున్నారు. మత ఉన్మాదాన్ని రెచ్చగొడుతూ కుట్రలకు పాల్పడుతున్నారన్నారు. ప్రజలకు, చట్టాలకు జవాబుదారీగా ఉండాల్సిన అధికార యంత్రాంగం ప్రభుత్వాలకు, పార్టీలకు, నేతలకు దాసోహం అనడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ స్థితిలో సిపిఎం ఎన్నికల అనంతరం ప్రజలను అంటిపెట్టుకొని ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజల ఎజెండాను ముందుకు తెస్తుంది. ధన రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నది. ప్రజలు, వివిధ పార్టీల కార్యకర్తలు… బిజెపి, మోడీ విద్వేష ఎజెండా ప్రమాదాన్ని గమనించి తిప్పి కొట్టాలి. మోడీకి వత్తాసు పలుకుతున్న టిడిపి, వైసిపిల నేతల మెడలు వంచాలని పిలుపునిచ్చారు. తప్పులను ఖండించాలని చైతన్య పరిచారు. ధన రాజకీయాలను తిప్పి కొట్టాలని హెచ్చరించారు. దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడుకోవాలని సూచించారు. నేడు జరిగిన పర్యటనలో సిపిఎం నేతలు బి.రమణరావు, కె.దుర్గారావు, నిజాముద్దీన్‌, విజయ, దేవి కుమారి, మూర్తి, ఎంఎన్‌ పాత్రుడు, రమేష్‌, మారుతి శ్రీనివాస్‌, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

➡️