Apr 20,2024 20:44

పకకడ్బందీగా పాలిసెట్‌ప్రజాశక్తి- విజయనగరం టౌన్‌ ఈనెల 27న జరిగే పాలిసెట్‌కు పకడ్బంధీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను జిల్లా రెవెన్యూ అధికారి ఎస్‌డి అనిత ఆదేశించారు. పాలిటెక్నిక్‌ ప్రవేశపరీక్ష-2024 నిర్వహణపై తన ఛాంబర్‌లో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్‌ఒ మాట్లాడుతూ, ఈ నెల 27న నిర్వహించే ఈ పరీక్షకు సుమారు 8864 మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. విజయనగరంలో 11, గజపతినగరంలో 6, బొబ్బిలిలో 7 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. విజయనగరం సెంటర్లలో 4509 మంది, గజపతినగరంలో 2009 మంది, బొబ్బిలిలో 2346 విద్యార్ధులు పరీక్ష రాయనున్నారని తెలిపారు. ఆరోజు ఉదయం 11 గంటలు నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుందని, విద్యార్ధులను గంట ముందు లోపలకు అనుమతిస్తామని తెలిపారు. ఎట్టిపరిస్థితిలోనూ 11 తరువాత ఒక్క నిమిషం దాటినా లోపలికి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని విద్యార్ధులకు తాగునీరు, ప్రాథమిక వైద్యశిబిరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేయాలని, పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పాలిసెట్‌కు సంబంధించిన ఇతర వివరాల కోసం సెల్‌ నెంబరు 7989781520 నెంబరుకు సంప్రదించాలని డిఆర్‌ఒ సూచించారు. సమావేశంలో పాలిసెట్‌ జిల్లా కో-ఆర్డినేటర్‌ ఆషారాణి, మున్సిపల్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ తిరుమలరావు, విద్య, విద్యుత్‌, వైద్యారోగ్య, పోలీసు, రెవెన్యూ తదితర శాఖల అధికారులు, పరీక్షా కేంద్రాల కో-ఆర్డినేటర్లు పాల్గొన్నారు.

➡️