Apr 29,2024 21:38

ఓటర్లలో విశ్వాసాన్ని కల్గించాలిశ్రీ సూక్ష్మ పరిశీలకులది కీలక పాత్రశ్రీ జిల్లా పరిశీలకులు హనీష్‌ చాబ్రా, తలాత్‌ పర్వేజ్‌శ్రీ పోలింగ్‌ సిబ్బందితోపాటే మైక్రో అబ్జర్వర్లు వెళ్లాలిశ్రీ జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మిప్రజాశక్తి-విజయనగరంకోటపారదర్శకంగా ఓటింగ్‌ ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు హనీష్‌ చాబ్రా, తలాత్‌ పర్వేజ్‌ ఇక్బాల్‌ రోహెల్లా కోరారు. ఎన్నికల నిర్వహణలో సూక్ష్మ పరిశీలకులది కీలక పాత్ర అని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ పట్ల ఓటర్లలో, ప్రజల్లో నమ్మకాన్ని కల్పించాల్సిన బాధ్యత వీరిపై ఉందన్నారు. మైక్రో అబ్జర్వర్లకు కలెక్టరేట్‌ ఆడిటోరియంలో సోమవారం మొదటి విడత శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ నాగలక్ష్మి మాట్లాడుతూ, సూక్ష్మ పరిశీలకుల విధులు, నిబంధనలను వివరించారు. జిల్లాలోని సున్నిత, అతి సున్నిత పోలింగ్‌ కేంద్రాల్లో సూక్ష్మ పరిశీలకులను నియమిస్తామని చెప్పారు. మైక్రో అబ్జర్వర్లు ఎన్నికల రోజు తాము పరిశీలించిన విషయాన్ని రిపోర్టు రూపంలో అందజేయాల్సి ఉంటుందన్నారు. వీరిచ్చే రిపోర్టు ఎంతో కీలకమని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఒక్కోసారి వీరిచ్చే రిపోర్టు ఆధారంగా అబ్జర్వర్లు రీపోలింగ్‌కు కూడా ఆదేశాలను జారీ చేసే అవకాశం ఉంటుందన్నారు. ఎన్నిక మరునాడు జిల్లా పరిశీలకులు నిర్వహించే స్క్రూటినీలో, సూక్ష్మ పరిశీలకుల రిపోర్టుల ఆధారంగానే నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. వీరుకూడా పోలింగ్‌ సిబ్బందితో పాటు ముందురోజు రాత్రే పోలింగ్‌ కేంద్రాలకు చేరుకోవాలని ఆదేశించారు. ఉదయం 5.30కు జరిగే మాక్‌ పోల్‌ నుంచి, ఓటింగ్‌ ప్రక్రియ పూర్తయ్యేవరకూ వీరు అక్కడే తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. అనంతరం సిబ్బందితోపాటు రిసెప్షన్‌ సెంటర్‌కు చేరుకొని నివేదికను సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ, పిఒలు, సెక్టార్‌ అధికారుల విధులపట్ల కూడా మైక్రో అబ్జర్వర్లకు పవర్‌పాయింట్‌ ద్వారా అవగాహన కల్పించారు. ఎన్నికల పరిశీలకులు చాబ్రా, తలాత్‌ పర్వేజ్‌ మాట్లాడుతూ సూక్ష్మ పరిశీలకుల విధులు, ప్రాధాన్యతను వివరించారు. ఏదైనా సందేహం తలెత్తితే తమను సంప్రదించ వచ్చునని సూచించారు. పోలింగ్‌ సిబ్బందితోపాటే వీరు కూడా ముందురోజే పోలింగ్‌ కేంద్రాలకు చేరుకోవాలన్నారు. 6 గంటల సమయానికి క్యూలైన్లలో ఉన్నవారికి చివరినుంచి సీరియల్‌ నెంబర్లు కేటాయించి, అందరికీ ఓటు వేసే అవకాశం కల్పించాలని సూచించారు. పోలింగ్‌ ముగిసాక తమ రిపోర్టును సీల్డు కవరులో సమర్పించాలని చెప్పారు. మాక్‌ పోల్‌ తప్పనిసరి అని, దీనివల్ల ఓటర్లలో, ఏజెంట్లలో ఓటింగ్‌ ప్రక్రియ పట్ల నమ్మకం, విశ్వాసం ఏర్పడతాయని అన్నారు. ఓటింగ్‌ కంపార్ట్‌మెంట్‌లో ఓటు వేసే దృశ్యాన్ని వీడియో రికార్డింగ్‌, వెబ్‌ కాస్టింగ్‌ చేయకూడదని, ఓటర్లు తాము ఎవరికి ఓటు వేశారో, ఆ రహస్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపైనా ఉందని అన్నారు. పోలింగ్‌ స్టేషన్లో కనీస సౌకర్యాలు లేకపోతే, సెక్టార్‌ అధికారుల దష్టికి తీసుకురావాలని సూచించారు. పోలింగ్‌ స్టేషన్లో ఏమైనా సమస్యలు తలెత్తినా, పోలింగ్‌ ఆలస్యం అయినా, ఓటర్లు ఓటు వేయడానికి రాకపోయినా వెంటనే ఆ విషయాన్ని తమ దష్టికి తీసుకురావాలని అబ్జర్వర్లు సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ వెంకట త్రివినాగ్‌, ఎఆర్‌ఒ సుమబాల, ట్రైనింగ్స్‌ నోడల్‌ ఆఫీసర్‌ సుధాకరరావు పాల్గొన్నారు

➡️