సైకిల్‌ స్పీడుకు బ్రేకులు..?

May 15,2024 21:39

ప్రజాశక్తి-సాలూరు :  పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పడిన తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఎవరు విజేతలో తేలాలంటే మరో 18 రోజులు నిరీక్షణ చేయక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి కంటే టిడిపి బలంగా కనిపించినా గ్రూపు రాజకీయాల కుంపటి గెలుపు అవకాశాలను దెబ్బ తీస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత, స్థానిక సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ప్రభావం కనిపించినా ప్రతిపక్ష కూటమి నాయకుల మధ్య అంతర్గత విభేదాలు గట్టిగా పనిచేసినట్లు తెలుస్తోంది. పోటీలో ఉన్న కూటమి అభ్యర్థులు కూడా పార్టీలో గ్రూపులను కలుపుకుని పోవడంలో విఫలం చెందారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ గ్రూపు రాజకీయాల ప్రభావం అధికారపార్టీ అభ్యర్థులకు లాభించిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. వెన్నుపోటు రాజకీయాల వల్ల మన్యం జిల్లాలో సైకిల్‌ స్పీడ్‌కి బ్రేకులు పడ్డాయనేది స్పష్టమవుతోంది. 
సాలూరు నియోజకవర్గంలో టిడిపిలో గ్రూపు రాజకీయాలు ఆది నుంచి వెంటాడుతున్నాయి. మాజీ ఎమ్మెల్సీ సంధ్యారాణికి సీటు ఇవ్వొద్దని, ఆమెకు టికెట్‌ ఇస్తే ఓటమి ఖాయమని మొదటి నుంచి వ్యతిరేక గ్రూపు నాయకులు వాదించారు. అభ్యర్థుల ప్రకటనకు రెండు నెలల ముందే పాలకొండ నియోజకవర్గానికి చెందిన ఎస్‌టి మహిళా నాయకురాలు మోజూరు తేజోవతిని మాజీ ఎమ్మెల్యే ఆర్‌పి భంజ్‌దేవ్‌ గ్రూపు నాయకులు తెరపైకి తెచ్చారు. వీరి వాదాన్ని పట్టించుకోని టిడిపి అధిష్టానం సంధ్యారాణినే ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించింది. గడచిన ఐదేళ్లుగా నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జిగా పని చేసిన సంధ్యారాణికి సీటు ఖరారు కావడం ఆమె వ్యతిరేక గ్రూపు నాయకులకు మింగుడు పడలేదు. అధిష్టానం పెద్దలు కూడా గ్రూపుల మధ్య సమన్వయం కుదర్చే ప్రయత్నాలు పెద్దగా చేయలేదు. మక్కువ మండల సీనియర్‌ నాయకులు పెంట తిరుపతిరావు, అభ్యర్థి సంధ్యారాణి మధ్య సయోధ్య కుదర్చడానికి విశాఖపట్నంలో టిడిపి అగ్ర నాయకులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అగ్రనాయకుల సూచనల మేరకు అభ్యర్థి సంధ్యారాణి సీనియర్‌ నాయకులు పెంట తిరుపతి రావును కలుపుకు పోలేదు. అంతేకాకుండా మాజీ ఎమ్మెల్యే భంజ్‌దేవ్‌ సేవలను అభ్యర్థి సంధ్యారాణి పూర్తి స్థాయిలో వినియోగించు కోకపోవడం స్పష్టంగా కనిపించింది. నాలుగు మండలాల్లోనూ అభ్యర్థి సంధ్యారాణికి కొంత వ్యతిరేక గ్రూపు నాయకులు ఉన్నారు. వారు ఎంతో కొంత మేర సైకిల్‌ స్పీడ్‌కి బ్రేకులు వేశారనే చర్చ నడుస్తోంది. పార్వతీపురం నియోజకవర్గంలోనూ టిడిపిని గ్రూపు రాజకీయాలు దెబ్బతీశాయనే వాదనలు వినిపిస్తున్నాయి. అభ్యర్ధి బోనెల విజయచంద్ర, మాజీ ఎమ్మెల్సీ ద్వారపు రెడ్డి జగదీష్‌, మాజీ ఎమ్మెల్యే చిరంజీవులు మధ్య సమన్వయ లోపం పార్టీ విజయావకాశాలను దెబ్బ తీస్తుందనే టాక్‌ వినిపిస్తోంది. యువకుడు, విద్యావంతుడైన అభ్యర్థి విజయచంద్ర కూడా దూకుడుగా వ్యవహరించడం ఆయన వ్యతిరేక గ్రూపు నాయకులకు మింగుడు పడని అంశంగా మారింది. సిటింగ్‌ ఎమ్మెల్యే జోగారావుపై నియోజకవర్గ వైసిపిలో బలమైన వ్యతిరేకత ఉన్న కారణంగా ఆయన గెలుపు అంత సులువు కాదనే అభిప్రాయం మొదట్లో వ్యక్తమైంది. ఈ వ్యతిరేకతను సొమ్ము చేసుకోవడంలో టిడిపి నాయకుల సమిష్టి కృషి లోపం స్పష్టంగా కనిపించింది. తాజా పరిణామాలు టిడిపి విజయానికి ఆటంకంగా నిలుస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పాలకొండ నియోజకవర్గంలో కూడా జనసేన అభ్యర్థి నిమ్మక జయకృష్ణకు గ్రూపు రాజకీయాల తలనొప్పి తప్పలేదని తెలుస్తోంది. టిడిపి నాయకుడైన జయకృష్ణ జనసేనలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని కూడా జనసేన, టిడిపి నాయకులు వ్యతిరేకించారు. ఇలాంటి పరిస్థితుల్లో జనసేన అభ్యర్థి జయకృష్ణ గట్టి పోటీ ఇచ్చినట్లు పైకి కనిపించినా పార్టీలో నెలకొన్న గ్రూపు రాజకీయాలు వైసిపి అభ్యర్థికి లాభించే అవకాశాలు మెండుగా ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. సాలూరు, పార్వతీపురం, పాలకొండ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థుల విజయానికి సొంత పార్టీ నాయకుల వెన్నుపోటు రాజకీయాలు ఆటంకంగా నిలిచాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కురుపాం నియోజకవర్గంలో మాత్రం టిడిపిలో గ్రూపు రాజకీయాలు ఉన్నా నాయకులు ఐక్యంగా పని చేయడం అభ్యర్థి తోయక జగదీశ్వరికి అనుకూల పరిణామంగా చెప్పొచ్చు. సిటింగ్‌ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణిపై ఉన్న వ్యతిరేకతని కూటమి అభ్యర్థి జగదీశ్వరి సొమ్ము చేసుకోవడంలో విజయవంతం అయినట్లు తెలుస్తోంది. నియోజకవర్గ నాయకులు వైరిచర్ల వీరేష్‌ చంద్రదేవ్‌, దత్తి లక్ష్మణరావు, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు సమన్వయంతో పనిచేయడం వల్ల టిడిపి అభ్యర్థి జగదీశ్వరికి విజయావకాశాలు మెరుగుపడ్డాయనే చర్చ జోరుగా సాగుతోంది. ఏమైనా మన్యం జిల్లాలో టిడిపి అభ్యర్థుల గెలుపు అవకాశాలను ఆపార్టీ నాయకులు ఏమేరకు దెబ్బ తీశారనేది తేలాలంటే మరో 18 రోజులు ఆగాల్సిందే మరి.

➡️