ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా జరిగేందుకు అధికారులు అవగాహన పెంపొందించుకోవాలి 

May 28,2024 19:05 #collector, #Kakinada

ప్రజాశక్తి – కాకినాడ : ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా జరిగేందుకు అధికారులు ప్రతి అంశంపైన సంపూర్ణంగా అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె.నివాస్ అధికారులను ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికలు-2024లో భాగంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి మంగళవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె.నివాస్ జాయింట్ కలెక్టర్, పిఠాపురం రిటర్నింగ్ అధికారి ఎస్ రామ్ సుందర్ రెడ్డితో కలిసి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అనుసరించాల్సిన విధానం, లెక్కింపు కేంద్రాల వద్ద ఏర్పాట్లు, పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంలలో పోలైన ఓట్ల లెక్కింపు ఏవిధంగా చేపట్టాలి, కౌంటింగ్ టేబుల్స్, రౌండ్లు వారిగా ఫలితాలు వెల్లడిలో ఆర్వోలు తిసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏజేంట్లు, అభ్యర్థులతో వ్యవహరించాల్సిన తీరు వంటి అంశాలపై జిల్లా కలెక్టర్, జేసీ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్, ఇతర ఎన్నికల అధికారులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె.నివాస్ మాట్లాడుతూ సాధారణ ఎన్నికలు-2024 నిర్వహణ తుది అంకానికి చేరుకుందని, జూన్ 4న జేఎన్టీయూలో నిర్వహించే ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా, ప్రశాంత వాతావరణంలో సాగేందుకు ప్రతి అంశంపైన ఆర్వోలు, ఏఆర్వోలు సంపూర్ణంగా అవగాహన పెంపొందించు కోవాలన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని ఓట్ల లెక్కింపు ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఎటువంటి సందేహం వచ్చినా వెంటనే పై అధికారులను సంప్రదించాలని ఆయన తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు 14 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్స్, మైక్రో అబ్జర్వర్లను సమన్వయం చేసుకుంటూ ఆర్డీవోలు, ఏఆర్వోలు పనిచేయాలని కలెక్టర్ సూచించారు. తొలుత జూన్ 4న ఉదయం 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని, పార్లమెంటు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ నెల 31 నాటికి కౌంటింగ్ ఏజేంట్ల వివరాలు అందిన వారికే ఆర్వోలు ఏజేంట్లగా గుర్తింపు కార్డులు జారిచేయాలన్నారు. ఓటర్ల నిజమైన ఎంపిక సరైన ఓట్ల లెక్కింపులోనే వ్యక్తమవుతుందని, రౌండ్లు వారిగా వెల్లడించే ఫలితాలు ఖారారు విషయంలో ఆర్వోల అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఏజేంట్ల సంతకాలు తిసుకోవాలని ఆయన సూచించారు.
ఓట్ల లెక్కింపు ప్రక్రియలో తరచుగా ఎదురయ్యే వివిధ సంఘటనలను ఏ విధంగా పరిష్కరించాలో జాయింట్ కలెక్టర్ ఎస్.రామ్ సుందర్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అధికారులకు అవగాహన కల్పించారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి డా.డి.తిప్పే నాయక్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

➡️