బిజెపి, దాని మిత్రులను ఓడించండి : మధు

మాట్లాడుతున్న పి మధు

ప్రజాశక్తి-తాడేపల్లి  :  దేశంలో లక్షలాది కోట్లు ఎన్నికల బాండ్లు ద్వారా రాబట్టుకుని అవినీతి జలగగా ఉన్న బిజెపిని, దానికి మద్దతు ఇస్తున్న మిత్రులను ఓడించాలని మాజీ ఎంపి పి.మధు పిలుపు నిచ్చారు. శనివారం రాత్రి తాడేపల్లి బైపాస్‌ రోడ్డులోని అడ్వైంచర్‌లో జరిగిన తాడేపల్లి ప్రముఖులు పాల్గొన్న సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సమావేశానికి పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు డి.విజయ భాస్కరరెడ్డి అధ్యక్షత వహించారు. మధు మాట్లా డుతూ అవినీతిగా సంపాదించిన సొమ్ములో ఎమ్మెల్యే, ఎంపిలను కొనుగోలు చేసి రాజ్యాంగ వ్యవస్థను తన గుప్పెట్లో పెట్టుకుని దేశాన్ని సర్వనాశనం చేసిన బిజెపికి అధికారంలో ఉండే అర్హతలేదన్నారు. ఎన్నికల బాండ్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు ప్రజలకు న్యాయవ్యవస్థ మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టిందని చెప్పారు. దేశంలో యుపి, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, తమిళనాడు, హర్యానా తదితర రాష్ట్రాల్లో రానున్న ఎన్నికల్లో బిజెపికి గణనీయంగా స్థానాలు తగ్గనున్నా యన్నారు. ఇండియా ఫోరమ్‌ అభ్యర్థులు బిజెపితో ముఖాముఖి తలపడటమే ఇందుకు కారణమన్నారు. క్రేజివాల్‌ను అక్రమ అరెస్టు చేయడం సరికాదన్నారు. కార్పొరేట్ల కోసం బిజెపి పని చేస్తుంటే పేదల ప్రజల కోసం సిపిఎం పని చేస్తుందన్నారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.కృష్ణయ్య మాట్లాడుతూ కార్యకర్తలు ఈ 40 రోజులు కఠోర దీక్షతో పని చేసి ఈ ప్రాంతంలో అభ్యుదయ శక్తుల మద్దతు కూడగట్టాలన్నారు. విజ్ఞాన కేంద్రాల రాష్ట్ర కన్వీనర్‌ పి.మురళీకృష్ణ మాట్లాడుతూ తాడేపల్లి మంగళగిరి ప్రాంతాల్లో బహుముఖ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో బాలల కోసం మరిన్ని కార్యక్రమాలకు రూపకల్పన చేస్తామన్నారు. సిపిఎం సీనియర్‌ నాయకులు జొన్నా శివశంకరరావు మాట్లాడుతూ ఇండియా ఫోరమ్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సమావేశంలో యార్లగడ్డ సుబ్బారావు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

➡️