బీసీజీ వ్యాక్సిన్‌తో సైడ్‌ఎఫెక్ట్స్‌ ఉండవు

Jun 25,2024 23:25

ప్రజాశక్తి -పొన్నూరు : రాష్ట్ర ప్రభుత్వం క్షయ వ్యాధి రహిత సమాజం కోసం మూడు నెలలు పాటు అడల్ట్‌ బీసీజీ వ్యాక్సినేషన్‌ను చేపట్టిందని ఇందిరానగర్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఎర్రంశెట్టి అలేఖ్య తెలిపారు. వ్యాక్సిన్‌ వల్ల సైడ్‌ ఎఫెక్టులు ఏమీ ఉండవని, ఏమైనా అపోహలుంటే వీటిని వీడి అవసరమైన వారంతా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆస్పత్రిలో మంగళవారం విలేకర్లతో మాట్లాడారు. 18-59 ఏళ్లవారు, షుగర్‌ వ్యాధిగ్రస్తులు, క్షయ వ్యాధి సోకి ఐదేళ్లు దాటిన వారు, అదే కుటుంబంలో క్షయ వ్యాధి సోకి మూడేళ్లు పైబడిన వారు అడల్ట్‌ బిసిజి వ్యాక్సిన్‌ చేయించుకోవచ్చని చెప్పారు. ధూమపానం చేసేవారు, పాన్‌ పరాగులు, గుట్కాలు, మద్యం సేవించేవారు కూడా ఈ వ్యాక్సిన్‌ వేయించుకోవాలన్నారు. క్షయ వ్యాధిగ్రస్తుల వారి గాలి పీల్చిన, వుమ్మి తుంపర్రులు పడిన క్షయ వ్యాధి ఇతరులకు సోకుతుందని, అలాంటివారు చేయించుకోవడం ద్వారా ఆటో యాంటీ బాడీస్‌ (వ్యాధి నిరోధక శక్తి) పెరుగుతుందని తెలిపారు. 60 సంవత్సరాలు పైబడిన వారు కూడా అడల్ట్‌ బీసీజీ వ్యాక్సిన్‌ చేయించుకోవచ్చని తెలిపారు. ఇందిరా నగర్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ పరిధిలో 60 ఏళ్లు దాటిన నాలుగు వేల మందికి అడల్ట్‌ బీసీజీ వ్యాక్సిన్‌ కోసం సర్వే నిర్వహించి గుర్తించామని తెలిపారు. ఇప్పటికీ గత 40 రోజుల నుండి వారంలో ప్రతి సోమవారం, గురువారం వ్యాక్సిన్‌ వేస్తున్నామని, ఈ కార్యక్రమం 50 రోజులపాటు ఉంటుందని తెలిపారు. వ్యాక్సిన్‌ వేయించుకున్న వారికి కొద్దిపాటి జ్వరం రెండు రోజులపాటు ఉంటుందని, భయాందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ ద్వారా సుమారు 25 వేల మంది జనాభాకు వైద్య సేవలు ఉచితంగా అందిస్తున్నామని, ప్రతిరోజూ 60-70 మంది వరకు రోగులకు వైద్య సేవలు పొందుతున్నారని చెప్పారు.

➡️