పార్కిన్సన్స్‌పై లలిత హాస్పిటల్‌లో అవగాహన సదస్సు

డిబిఎస్‌ చికిత్స గురించి బ్రోచర్‌ విడుదల చేస్తున్న డాక్టర్‌ విజయ, తదితరులు

ప్రజాశక్తి-గుంటూరు :  పార్కిన్సోనిజం వ్యాధిపై అవగాహనకు ప్రపంచ పార్కిన్సన్స్‌ దినోత్సవం సందర్భంగా గురువారం స్థానిక లలితా హాస్పిటల్‌ ఆవరణలో న్యూరోసైన్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్కిన్సన్స్‌, ఎండిఎస్‌ క్లినిక్‌ అనే ప్రత్యేక ఓపిడి క్లినిక్స్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎపిఎన్‌ఎస్‌ఎ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ పి.విజయ మాట్లాడుతూ పార్కిన్సన్స్‌ వ్యాధి నరాల సంబంధిత రుగ్మత అని, ఇది దేశంలో వేగంగా పెరుగుతుందన్నారు. 60 ఏళ్లు పైబడిన వారిలో 1 శాతం మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారని తెలిపారు. వణుకు, మాట తడబడటం, నడక మందగించటం, తూలు, తరచూ పడిపోవటం, మలబద్దకం, నిద్ర సమస్యలు ఈ వ్యాధి ముఖ్యలక్షణాలన్నారు. వ్యాధి లక్షణాలు, కారణాలు, చికిత్సల గురించి పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా డాక్టర్‌ విజయ వివరించారు. పార్కిన్సన్స్‌కు డీప్‌ బ్రెయిన్‌ స్టిమ్యులేషన్‌ అనే అధునాతన చికిత్స విధానాన్ని లలిత సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్‌లో త్వరలో ప్రారంభిస్తామని చీఫ్‌ న్యూరోసర్జన్‌ డాక్టర్‌ ఎన్‌.శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ ఎన్‌.శ్రీనివాసరావు, డాక్టర్‌ బి.ఉషాకిరణ్‌, డాక్టర్‌ వై.రామచంద్ర, డాక్టర్‌ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

➡️