పండుటాకుల పడిగాపులు!

May 2,2024 23:09

చిలకలూరిపేటలో వృద్ధుల అవస్థ
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి :
ఎన్నికల నేపథ్యంలో సామాజిక పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం ఒక్కొ నెలలో ఒక్కొ నిర్ణయం తీసుకోవడం వల్ల లబ్ధిదారులు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గుంటూరు జిల్లాలో 2,61,598 మంది లబ్ధిదార్లు ఉండగా వీరికి ప్రతినెలా రూ.81,47,76,500 ప్రభుత్వం అందిస్తోంది. పల్నాడు జిల్లాలో 2,83,119 మందికి రూ.84,58,51,500 అందిస్తున్నారు. ఐదేళ్లుగా ప్రతి నెలా మొదటి వారంలో మూడు రోజుల పాటు పింఛను సొమ్ము ఇంటికి వచ్చి వాలంటీర్లు ఇచ్చేవారు. అయితే గత నెల, ఈ నెల పింఛన్లు కోసం వృద్దులు, వికలాంగులు, వితంతువులు ఇబ్బందులు పడుతున్నారు. గతనెలలో సచివాలయాల వద్ద పంపిణీ చేయగా ఈనెలలో బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో వృద్దులు, మహిళలు బ్యాంకులకు వెళ్లి తమ పింఛను సొమ్ము డ్రా చేసుకోవడానికి తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. లభ్ధిదారులు నివశిస్తున్న ప్రాంతానికి బ్యాంకులు దూరంగా ఉండటం, తీరా ఎదో వాహనం కిరాయికి మాట్లాడుకుని బ్యాంకులకు వెళితే గంటల తరబడి పడిగాపులు దృశ్యాలు పలు ప్రాంతాల్లో కన్పించాయి. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ అనుసంధానం కాకపోవడం, తాజాగా ఈకేవైసి చేయకపోవడం, జీరో బ్యాలెన్సు ఉండటంతో కొంత మొత్తం ఫెనాల్టి రూపంలో కట్‌ చేసుకోవడం, చాలా కాలంగా వారి బ్యాంకు ఖాతాలలో లావాదేవీలు జరగకపోవడం వంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సచివాలయాల ద్వారా ఇంటి వద్ద పింఛన్లు ఇచ్చే అవకాశం ఉన్నా ప్రభుత్వం లబ్ధిదారులను ఇబ్బంది పెడ్తుందని టిడిపి, జనసేన నాయకులు ప్రచారం చేస్తుండగా వాలంటీర్లపై టిడిపి, జనసేన తప్పుడు ఫిర్యాదులు చేయడం వల్ల వీరిని పింఛన్ల పంపిణీ నుంచి మినహాయించడంతో ఇబ్బందులు వచ్చాయని వైసిపి వారు ప్రచారం చేస్తున్నారు. మొత్తం టిడిపి, వైసిపి రాజకీయ చదరంగంలో వృద్ధులు వికలాంగులు పింఛన్లు పొందటానికి పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమకు ఏ బ్యాంకులో సొమ్ము జమ అయిందో తెలియక పలువురు లబ్ధిదారులు సచివాలయాలకు వెళ్తున్నారు. అక్కడ సిబ్బంది పరిశీలించి మీ సొమ్ము బ్యాంకులకు వెళ్లింది.. మీకు ఎక్కడ ఖాతా ఉంటే అక్కడికి వెళ్లి తెలుసుకోండి.. అని జవాబు ఇస్తున్నారు. దీంతో ఒక సారిసచివాలయం, మరో సారి బ్యాంకులకు లబ్ధిదారులు వెళ్తున్నారు. బ్యాంకుల్లో పలు సాంకేతిక సమస్యలు లబ్దిదారులను ఇబ్బంది పెడుతున్నాయి. బ్యాంకులు ఖాతాలు లేని వారు, ఒకరికే రెండుమూడు ఖాతాలు ఉన్నవారు, ఖాతాలు మురిగిపోయిన వారు తమ పింఛన్లు కోసం ఇటు సచివాలయం, అటు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నారు. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో ఫించన్ల పంపిణీకి ముందస్తు కసరత్తు లేకుండా గతనెల 28న బ్యాంకుల ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకోవడంపైనా విమర్శలువచ్చాయి. ఏప్రిల్‌, మే నెల పింఛన్ల పంపిణీకి మధ్య నెలరోజుల సమయం ఉంది. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు సంబంధించి ఏ బ్యాంకు ఖాతాకు ఆధార్‌ అనుసంధానం జరిగింది.? ఏ బ్యాంకు ఖాతా పనిచేస్తుంది? ఏ ఖాతాలో జమచేయాలి. మురిగిపోయిన ఖాతాలు ఎన్ని వంటి వివరాలు సేకరించకుండా 28న బ్యాంకుల ద్వారా పంపిణికీ నిర్ణయం తీసుకోవడంపై విమర్శలు వచ్చాయి. పిడుగురాళ్లలో పలువురు లబ్ధిదారులు తమ సొమ్ము ఏ బ్యాంకు ఖాతాల్లో జమ అయిందో చెప్పాలని వృద్ధులు సచివాలయం చుట్టూ తిరిగారు. ముపాళ్ల సచివాలయం పరిధిలో ఇంటింటికి పంపిణీ ఎందుకు నిలిపివేశారని సిబ్బందిని పలువురు ప్రశ్నించగా ఇందుకు టిడిపియే కారణమని అక్కడే ఉన్న వైసిపి నాయకులు సమాధానం ఇచ్చారు. గతనెల సచివాలయం వద్ద ఇచ్చారు కదా ఈ సారి ఎందుకు ఇవ్వరని ప్రశ్నించగా మీ ఖాతా వున్న బ్యాంకుకు వెళ్లాలని సిబ్బంది సూచించారు. ఎండలో వృద్ధులు, వికలాంగులు కొంతమంది సత్తెనపల్లిలో ఆయా బ్యాంకుల వద్దకు చేరుకోగా, మరికొందరు బ్యాంకు సేవా కేంద్రాలా వద్ద బారులు తీరారు. వందలాది మంది బ్యాంకుల ముందు పడిగాల్పులు పడ్డారు. తమ బ్యాంకు ఖాతాల వివరాలు ముందుగా తీసుకోకుండా తమ సొమ్ము ఎలా జమచేస్తారని పలువురు ప్రశ్నించారు. మరోవైపు బ్యాంకు ఖాతాల్లో పడిన పించన్‌ నగదు తీసుకునేందుకు వద్ధులు అష్టకష్టాలు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పింఛను దారులకు పట్టణ ప్రాంతాలు, మండల కేంద్రాల్లోని బ్యాంకు ల్లో ఖాతాలు ఉన్నాయి. పించన్‌ డబ్బులు తీసుకునేందుకు చాలా దూరం వెళ్లాల్సి రావడంతో వద్దులు అగచాట్లు పడుతున్నారు. అయితే వికలాంగులు, నడవలేని స్థితిలో ఉన్నవారు, మంచనా పడిన వారికి మాత్రం నేరుగా ఇళ్లకు వెళ్లి సచివాలయం సిబ్బంది పింఛన్లు ఇస్తున్నారని ఈ ప్రక్రియ 4వ తేదీ రాత్రి లోగా పూర్తవుతుందని అధికారులు తెలిపారు. 90 శాతం మందికి బ్యాంకు ఖాతాల్లో పింఛనుసొమ్ము జమ చేశామని, ఖాతాలు సరిగాలేని వారికి నేరుగా ఇంటికి వెళ్లి ఇస్తామని అధికారులు చెప్పారు.

➡️