పార్వతీపురం.. ఎవరి పరం?

May 3,2024 21:50

ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్‌ : పార్వతీపురం ఎస్‌సి రిజర్వు అసెంబ్లీ నియోజకవర్గం ఎవరి పరం కానుంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే అలజంగి జోగారావుకు ఎదురీత తప్పదా? కొత్తగా తొలిసారి బరిలో దిగిన టిడిపి అభ్యర్థి విజయచంద్ర నెగ్గుకొస్తారా? ఇండియా వేదిక మద్దతుతో పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి ఏ మేరకు రాణిస్తారు.. అంటూ నియోజకవర్గంలో చర్చ జరగుతోంది. నియోజకవర్గంలో 10 నామినేషన్లు దాఖలుకాగా ఇద్దరు స్వతంత్ర అభ్యర్ధులు తన నామి నేషన్‌లను ఉపసంహరించుకున్నారు. ప్రధానంగా పోటీ పడేది ప్రధాన పార్టీల నుండి ముగ్గురే అభ్యర్ధులు. వైసిపి నుండి రెండోసారి ప్రస్తుత ఎమ్మెల్యే అలజంగిజోగారావు పోటీ చేస్తుండగా, టిడిపి బోనెల విజయచంద్రను రంగంలోకి దించింది. ఇండియా కూటమి తరపున కాంగ్రెస్‌ పార్టీ నుండి బత్తిన మోహనరావు పోటీ చేస్తున్నారు. గత ఆర్నెళ్లుగా ప్రచారం ప్రారంభించిన స్వతంత్ర అభ్యర్ధి, గర్భాపు ఉదయభాను కూడా ఎంతో కొంత ఓటర్లపై ప్రభావం చూపిస్తారనే వాదన ఉంది. ఇక మిగతా నలుగురు అభ్యర్ధులు అంతంత మాత్రమే. ఇప్పటికే ప్రచార బరిలో దిగిన వైసిపి, టిడిపి పార్టీలు ఒకరికి మించి ఒకరు ప్రచారం సాగిస్తున్నారు. వైసిపి పార్టీకి బలమైన అభ్యర్ధితో పాటు, నియోజకవర్గంలో అన్ని మండలాల్లోనూ పటిష్టమైన కేడర్‌ కలిగి ఉంది. అయితే ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు ఆయనకు మైనస్‌గా మారుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందువరకు వైసిపితో పోలిస్తే టిడిపి బలహీనంగా కనిపించినప్పటికీ, బిజెపి,జనసేన కూటమి కలసి రావడం, టిడిపిలోని పాత నాయకులు దూరంగా ఉండడంతో దీన్ని అవకాశంగా మార్చుకుని ఇంత వరకూ స్తబ్దుగా ఉన్న ఆపార్టీలో యువ కార్యకర్తలు, నాయకులు రెట్టింపు ఉత్సాహంతో టిడిపి గెలుపునకు పనిచేస్తున్నారు. అయితే మాజీఎమ్మెల్యే బి.చిరంజీవులు, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌ ఈయనకు ఏ మేరకు సహకరిస్తారో చూడాల్సి ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత, ఉమ్మడి మేనిఫెస్టో పైనే ఆశలన్నీ టిడిపి అభ్యర్ధి బోనెల విజయచంద్ర ప్రభుత్వ వ్యతిరేకత, ఉమ్మడి మేనిఫెస్టోపైనే ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలలో వైసిపి ప్రభుత్వంపై వ్యతిరేకత,స్ధానిక ఎమ్మెల్యేపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి, జనసేన, టిడిపి కలసి ప్రకటించిన ఉచిత సంక్షేమ పధకాల హామీలపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకుని, ఆదిశగా, ప్రజల్లో ప్రచారం చేస్తున్నారు. విజయచంద్ర రాజకీయాలకు కొత్తకావడంతో వ్యక్తిగతంగా అతనిపై ఎటువంటి అవినీతి ఆరోపణలు లేకపోవడం ప్రత్యర్ధితోపోలిస్తే కలిసివచ్చే అంశం. కూటమి భాగ స్వామ్య పార్టీకి చెందిన జన సేన యువ కార్య కర్తలు, టిడిపి కేడర్‌తో కలసి ఐక్యం గా పనిచేయడంతో టిడిపి అభిమానులు, తటస్దులు కలసి వస్తున్నారు. అయితే సిట్టింగ్‌ఎమ్మెల్యే అలజంగిజోగారావు అంగబలం, అర్ధబలం ముందు ఎంత వరకూ ఇవి పనిచేస్తాయన్నది అనుమానమే. నియోజకవర్గానికి కొత్తముఖమైన బోనెల విజయచంద్ర టిడిపిలోని సీనియర్‌లతో పాటు, కొన్ని వర్గాలను కలుపుకు పోవడంలో విఫలమైతున్నారని, ఆయన ఏకపక్షధోరణి కార్యకర్తలకు, అభిమానులకు మింగుడుపడడంలేదని, ఖర్చు విషయంలో కూడా చాలా వెనుకంజలో ఉండడం కూడా ఆయనకు మైనస్సేనని చెబుతున్నారు. ఈ పరిస్ధితులన్నిటిని అధిగమించి, ప్రత్యర్ధి రాజకీయ చాణక్యాన్ని ఎదురొడ్డి ఎంతవరకు విజయ సాధిస్తారనేది చూడాలి.సంక్షేమ పథకాలు, వాలంటీర్లపైనే నమ్మకం వైసిపి అభ్యర్ధి అలజంగి జోగారావు సంక్షేమ పధకాల లబ్దిదారులను ఆకర్షించడం, వాలంటర్లను మచ్చిక చేసుకోవడంతోపాటు ఎన్నికలలో నెగ్గేందుకు పక్కా ప్రణాళికతో, పదనైన వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. పార్టీ ఇచ్చిన గడపగడపకు వంటి కార్యక్రమా లన్నిటికీ సద్వినియోగం చేసుకున్నారు. స్ధానిక ఎన్నికలలో జడ్‌పిటిసిలు, ఎంపిపిలు, సర్పంచ్‌లు, మున్సిపల్‌ కౌన్సిలర్‌లు, చైర్‌పర్సన్‌ పదవులను తనకు అను కూలమైన వారితో నింపుకున్నారు. నియోజక వర్గంలోని అన్ని గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, గ్రామస్దులతో స త్స ంబంధాలు ఏర్పరు చుకున్నారు. అయితే గత ఐదేళ్ల కాలంలో ఆయనపై భూకబ్జాలు, అవినీతి, వంటి ఆరోపణలు బాగా వినిపించాయి. అవే ఆయన కొంప ముంచుతాయన్న చర్చ జరుగుతోంది. టిడిపికి ప్రజల్లో ఆదరణ ఉన్నప్పటికీ, గ్రామాల్లో సరైన నాయకత్వం లేకపోవడాన్ని తనకు అనుకూలంగా మలుచుకుని గతం కంటే ఎక్కువ మెజారిటీతో గెలవడానికి ప్రయత్ని స్తున్నారు. అధికార, ప్రతిపక్షాల వైఫల్యాలే ఆయుధాలుకాంగ్రెస్‌ అభ్యర్థి బత్తిన మోహనరావు పాలకొండకు చెందిన యువన్యాయవాది. రాజకీయాలతో పాటు, నియోజకవర్గానికి క కూడా కొత్త. ప్రభుత్వ వ్యతిరేకత, ప్రతిపక్షంగా టిడిపి వైఫల్యాలు, స్ధానిక అభ్యర్ధి జోగారావు అవినీతి గురించి ప్రచారం చేస్తూ ఈ ఎన్నికలలో నెగ్గాలని ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్ధిగా నే కాకుండా ఇండియా వేదిక అభ్యర్ధి కావడంతో సిపిఎం,సిపిఐ పార్టీలు ఆయన గెలుపుకోసం కృషి చేస్తుండటం ఆయనకు కలసి వచ్చిన అంశం. సీతానగరం మండలం పెదభోగిలి కి చెందిన ఈయన విశాఖపట్టణంలోని నావల్‌ డాక్‌యార్డులో ఉద్యోగం చేస్తున్నప్పుడు కాంగ్రెస్‌ సంబంధిత కార్మిక సంఘాలకు నాయకత్వం వహించిన అనుభవం ఉంది. దీనితోపాటు మాజీ కేంద్రమంత్రి వైరిచర్ల కిశోర్‌పై అభిమానంతో ఉద్యోగ విరమణ అనంతరం కాంగ్రెస్‌ పార్టీలోకి వచ్చి అతనికి అనుచరుడుగా మారారు.

➡️