ఖైదీల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి సారించండి

Feb 17,2024 16:51 #hindu puraam
  • అదనపు జిల్లా జడ్జి కం పల్లె శైలజ

ప్రజాశక్తి -హిందూపురం(శ్రీ సత్యసాయి జిల్లా) : సబ్ జైలులో ఉన్న ఖైదీల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలని అదనపు జిల్లా జడ్జి కంపల్లె శైలజ వైద్యాధికారి ఆనంద్ కు సూచించారు. శనివారం స్థానిక సబ్ జైలును ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రస్తుతం సబ్ జైలులో ఎంతమంది ఖైదీలు ఉన్నారు, ఏ ఏ కేసుల్లో నిందితులు అన్న వివరాలను సబ్ జైలు అధికారి అంజి నాయక్ తో అడిగి తెలుసుకున్నారు. అనంతరం సబ్ జైలు గదులను పరిశీలించి, ఖైదీలతో నేరుగా సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. బెయిలు రాని నిందితులు ఎవరైనా ఉంటే తెలియజేయాలని సూచించారు. అదేవిధంగా పిటి వారెంట్ లపై జైలులో ఉన్న నిందితుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జైలు అధికారితో సౌకర్యాలు సమస్యలు తదితర అంశాలపై చర్చించారు. ఎవరైనా నిందితులు అనారోగ్యంతో బాధపడుతుంటే నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు వైద్య సదుపాయాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా అంతకు ముందు అదనపు జిల్లా ఆవరణలో లో క్ అదాలత్ నిర్వహించి అర్జీదారులతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అవకాశం ఉన్న సమస్యలను పరిష్కరించి మిగిలిన సమస్యలపై అర్జీదారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు సుదర్శన్, నాగరాజు రెడ్డి, నవేరా, పార్వతి, రవికుమార్, గోపాల్ , లోక్ అదాలత్ సిబ్బంది హేమావతి తదితరులు పాల్గొన్నారు.

➡️