పింఛను కోసం పడిగాపులు

May 2,2024 22:15

 బ్యాంకుల్లో అష్టకష్టాలు

అకౌంట్లు నిర్వహణలో లేక అగచాట్లు

ఫింగర్‌ ప్రింట్లు పడక మరికొంతమంది ఇబ్బందులు

విత్‌డ్రా ఫారం నింపేందుకూ డబ్బులు వసూలు

ప్రజాశక్తి విలేకర్ల బృందం  : ప్రభుత్వం ఇళ్ల వద్ద పింఛను డబ్బులు ఇవ్వకుండా డిబిటి విధానం ద్వారా వారి అకౌంట్లలో డబ్బులు జమ చేయడంతో పింఛన్ల కోసం వృద్ధులు, వితంతువులు మండుటెండలో బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఉదయం 9గంటలకే బ్యాంకులకు చేరుకొని గంటల తరబడి వేచి ఉంటున్నారు. తమకు డబ్బులు పడ్డాయో లేదో తెలసుకునేందుకు నానా యాతనలు పడుతున్నారు. ప్రభుత్వం తెచ్చిన ఈ విధానంపై మండిపడుతున్నారు. గుమ్మలక్ష్మీపురం : ఏజెన్సీలో పింఛను లబ్ధిదారులకు పడిగాపులు తప్పడం లేదు. గురువారం ఉదయం ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న గిరిశిఖర గ్రామాల నుంచి పింఛను డబ్బులు కోసం మండల కేంద్రంలో ఉన్న బ్యాంకులకు రావడానికి అష్ట కష్టాలు పడాల్సి వచ్చింది. ఉదయం 8 గంటల నుంచే పింఛన్ల కోసం వృద్ధులు, వితంతువులు మండుటెండలో బారులు తీరుతూ కనిపించారు.

రామభద్రపురం : పింఛను కోసం మండుటెండలో వృద్దులు బ్యాంకులకు రావడానికి అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. మండల కేంద్రంతో పాటు ఆరికతోట, కొట్టక్కి పాయింట్ల వద్ద పింఛను దారులు క్యూ కట్టారు. మండల కేంద్రంలోని బిసి పాయింట్‌ వద్ద స్థానిక ఎస్‌బిఐ మేనేజర్‌ సతీష్‌ కుమార్‌ ఆధ్వర్యంలో త్వరిత గతిన పింఛను అందించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే చాలా మంది వృద్ధులకు అకౌంట్లు నిర్వహించక పోవడం, ఆధార్‌ అనుసంధానం కాక పోవడం, ఫింగర్‌ స్కానర్‌ వద్ద ఫింగర్‌ పడకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఎంపిడిఒ ఈశ్వరమ్మ, సిబ్బంది పింఛన్ల పంపిణీని పరిశీలించారు.

సాలూరు రూరల్‌ : పింఛన్ల కోసం వృద్ధులు బ్యాంకుల వద్ద ఉదయం 9 గంటల నుంచే పడిగాపులు కాశారు. మామిడిపల్లిలోని విశాఖ గ్రామీణ బ్యాంకు, యూనియన్‌ బ్యాంకు వద్ద వృద్ధులు గంటల తరబడి వేచి ఉన్నారు.కొందరికి తమ అకౌంట్లలో డబ్బులు పడకపోవడంతో నిరాశతో వెనుతిరిగారు. కొందరి బ్యాంకు అకౌంట్లు కాలం చెల్లడంతో డబ్బులు పడలేదని తెలుసుకొని ఏమీ చేయాలో పాలుపోక ఇబ్బంది పడుతున్నారు.

పింఛను కోసం పడిగాపులు

రేగిడి : మండల కేంద్రంలోనిఆంధ్ర బ్యాంకు, దేవుదళ స్టేట్‌ బ్యాంకు వద్ద సామాజిక పింఛనుదార్లు క్యూ కట్టారు. రాజాం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పెన్షన్‌ కోసం లబ్ధిదారులు వెళితే బ్యాంకులో పెన్షన్‌ ఇవ్వడం జరగదని చెప్పి పంపించేశారు. స్తున్నారు.. ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితిలో పెన్షన్‌ దారులు ఎండలో తిరిగి వడదెబ్బకు గురై అస్వస్థతకు గురైన సంఘటనలు కనిపించాయి. డబ్బులు తీసుకునేందుకు విత్‌ డ్రా ఫారం నింపేందుకు 20 నుంచి 50 రూపాయల వరకు అక్కడి సిబ్బంది తీసుకుంటున్నారు.

మండుతున్న ఎండల్లో పింఛను కోసం యాతన

సాలూరు : పట్టణంలోని పలు బ్యాంకుల వద్ద గంటల తరబడి నిరీక్షించిన తర్వాత డబ్బులు తీసుకుని ఈసురోమని వెనుదిరిగారు. పాచిపెంట మండలం విశ్వనాథ పురం, మంచాడవలస, సాలూరు మండలం నెలిపర్తి, జీగిరాం, పురోహితుని వలస గ్రామాల నుంచి వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పింఛన్ల కోసం పట్టణానికి ఆటోల్లో చేరుకున్నారు.

➡️