సిఆర్‌టిల రెగ్యులరైజేషన్‌కు దండిగా వసూళ్లు

Apr 12,2024 21:42

ఒక్కొక్కరి నుంచి రూ.లక్షన్నర

గిరిజన సంక్షేమశాఖలో శృతిమించిన లంచాల పర్వం

అక్రమ బదిలీలకూ కలెక్షన్లు

ఫిర్యాదు చేసినా స్పందించని జిల్లా అధికారులు

ప్రజాశక్తి – సాలూరు :  ఐటిడిఎ ప్రాజెక్టు పరిధి గిరిజన సంక్షేమ శాఖ లో లంచాల పర్వం శతిమించి పోతోంది. లంచం లేనిదే ఫైళ్ళు ముందుకు కదలడం లేదన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కార్యాలయం బాస్‌ సూత్రధారిగా వసూళ్ల బాగోతం గత కొంతకాలంగా కొనసాగుతున్నా పట్టించుకున్న నాధుడే లేడు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కాంట్రాక్టు ఉపాధ్యాయుల రెగ్యులరైజేషన్‌ లో భాగంగా పార్వతీపురం ఐటిడిఎ పరిధిలో 133మంది సిఆర్‌టిలు అర్హత సాధించారు. వీరి నుంచి రకరకాల కొర్రీల పేరుతో కార్యాలయం అధికారులు దండిగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో సిఆర్‌టి నుంచి లక్షా 50వేల రూపాయల వరకు వసూలు చేయడం చర్చనీయాంశమవుతోంది. జీవో నెంబర్‌ 114 ప్రకారం సిఆర్‌టిల రెగ్యులరైజేషన్‌ చేపట్టాల్సి ఉంది. 2014 జూన్‌ 2 లోగా చేరిన కాంట్రాక్టు ఉపాధ్యాయులంతా రెగ్యులరైజేషన్‌కు అర్హులని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 15న గిరిజన సంక్షేమశాఖ అధికారులు ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే రాష్ట్రంలో ఏ ఐటిడిఎ ప్రాజెక్టు పరిధిలోనూ జరగని విధంగా స్థానిక ఐటిడిఎ అధికారులు ఈ ప్రక్రియను అమలు చేయడం లో భారీగా చేతివాటం ప్రదర్శించారన్న ఆరోపణలు ఉన్నాయి. గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్ర కార్యాలయంలో పని చేస్తున్న ఓ అధికారి అండతో స్థానిక కార్యాలయం బాస్‌గా పనిచేస్తున్న అధికారి వసూళ్ళ బాగోతాన్ని నడిపించినట్లు తెలుస్తోంది.అసలే ఎన్నికల హడావుడిలో ప్రభుత్వ యంత్రాంగం, ప్రధాన రాజకీయ పార్టీలు వున్న సమయంలో గుట్టు చప్పుడు కాకుండా రెగ్యులరైజేషన్‌ ముసుగులో అధికారులు వసూళ్లు చేపట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జీవో నెంబర్‌ 114 ప్రకారం సిఆర్‌టిల రెగ్యలరైజేషన్‌ ప్రక్రియలో గిరిజన సంక్షేమ శాఖ స్థానిక అధికారులు చేసిన తప్పిదాలకు సిఆర్‌టిలను ఇబ్బంది పెట్టి వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. పత్రికల్లో ఉద్యోగ నియామక ప్రకటన ద్వారా దరఖాస్తు చేసుకుని అర్హతల మేరకు వీరంతా సిఆర్‌టిలుగా నియామకయ్యారు. కానీ అధికారులు మాత్రం వారిని పార్ట్‌ టైం టీచర్లుగా పేర్కొంటూ రాష్ట్ర స్థాయి కార్యాలయానికి పత్రాలు పంపించారు. దీనిపై రాష్ట్ర అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఐటిడిఎ అధికారులు పంపిన పత్రాలను వెనక్కి తిప్పి పంపించారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా కార్యాలయం అధికారులకు అక్షింతలు వేసినట్లు సమాచారం. రెగ్యులరైజేషన్‌ పత్రాలు వెనక్కి వచ్చాయని సాకుగా చూపి అధికారులు సిఆర్‌టి నుంచి లక్షా 50వేల రూపాయల చొప్పున వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో కొందరు ఉపాధ్యాయులే మధ్యవర్తులుగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. తమ ఉద్యోగాల రెగ్యలరైజేషన్‌ ప్రక్రియ ఎక్కడ నిలిచిపోతుందనే భయంతో సిఆర్‌టిలు అధికారులు అడిగినంత ముడుపులు చెల్లించినట్లు తెలుస్తోంది. రెగ్యులరైజేషన్‌ ప్రక్రియలో వసూళ్లతో పాటు సిఆర్‌టిల పోస్టింగ్‌ విషయం లోనూ నిబంధనలకు నీళ్ళొదిలారనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర కార్యాలయం నుంచి నియామకం ఉత్తర్వుల ప్రకారం కేటాయించిన పాఠశాలలకు ఉపాధ్యాయులను పంపించకుండా ఐటిడిఎ అధికారులు లంచాలు తీసుకుని ఇష్టారాజ్యంగా నియామకం చేయడం చర్చకు తెర రేపింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం బాలికల పాఠశాలల్లో మహిళా ఉపాధ్యాయులను నియమించాలి. కానీ మహిళా ఉపాధ్యాయులను బాలుర ఉన్నత పాఠశాలలో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అల్లు లక్ష్మి అనే పిఇటికి కొమరాడ మండలం ఉలిపిరి గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలకు నియమించారు. కానీ ఆమెను స్థానిక అధికారులు ఎస్‌.కోట మండలం కెజి పూడి గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలలో నియమించారు. అదే విధంగా ఉలిపిరి గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలలో నియామకమైన మరో మహిళాటీచర్‌ చంద్రికళని డోకిశిల గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలకు పంపించారు. ధరణి అనే మహిళా టీచర్‌ ని బొబ్బిలి గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల నుంచి డోకిశిల గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలలో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బాలికల పాఠశాలలకు కేటాయించిన మహిళా ఉపాధ్యాయులను బాలుర ఉన్నత పాఠశాలలకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం వెనుక కూడా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు చేతివాటం ప్రదర్శించారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. గతంలో గ్రేడ్‌-2 ప్రధానోపాధ్యాయులుగా ఉద్యోగోన్నతి కల్పించడం లోనూ అధికారులు నిబంధనల ప్రకారం వ్యవహరించలేదని ఫిర్యాదులు అందాయి. జీవో నెంబర్‌ 23 ప్రకారం హిందీ సీనియర్‌ అసిస్టెంట్‌కు గ్రేడ్‌-2 ప్రధానోపాధ్యాయుడిగా ఉద్యోగోన్నతి కల్పించడం వివాదాస్పదమైంది. దీనిపై తోటరమేష్‌ అనే ఉపాధ్యాయుడు కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ బదిలీలు, పదోన్నతులు కల్పిస్తూ ఐటిడిఎ అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఈ అక్రమాల పై జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌కు ఫిర్యాదు చేసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

➡️