బీసీలకు 50 ఏళ్లకే పింఛన్‌: టిడిపి

ప్రజాశక్తి-సంతనూతలపాడు: టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీసీలకు 50 ఏళ్లకే 4 వేల రూపాయల పెన్షన్‌ అందిస్తామని టిడిపి నాయకులు బొమ్మాజి అనిల్‌ కుమార్‌ అన్నారు. ఆదివారం మండలంలోని గంగవరం టిడిపి కార్యాలయంలో ‘జయహో బీసీ’ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ బీసీ సబ్‌ ప్లాన్‌ నిధులను సక్రమంగా వినియోగించి అభివృద్ధి చేస్తామని తెలిపారు. స్థానిక సంస్థలలో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసి ఆర్థిక అభివృద్ధి, ఉపాధి ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు. టిడిపి రాష్ట్ర కార్యదర్శి అడకా స్వాములు మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పరిపాలన కొనసాగుతుందని, పేద ప్రజలు మహిళలపై దాడులు, దోపిడీలు పెరిగిపోయి రౌడీరాజ్యంగా మారిందన్నారు. వైసిపి సైకో పాలనను అంతం చేద్దామని, రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడుని, ఎమ్మెల్యేగా బిఎన్‌ విజరు కుమార్‌ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గ కార్యదర్శి తన్నీరు శ్రీనివాస రావు, టిడిపి మండల అధ్యక్షులు మద్దినేని హరిబాబు, కోఆర్డినేటర్‌ రావులపల్లి సురేష్‌బాబు, నాయకులు కుంచాల రాజు, బాశం శ్రీను, కుంచాల ఆంజనేయులు, బొడ్డపాటి శ్రీనివాసరావు, రాయళ్ల సుబ్బారావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️