మరో అవకాశం ఇవ్వండి : కోలగట్ల

May 11,2024 21:41

ప్రజాశక్తి – విజయనగరం టౌన్‌ : అన్ని వర్గాల ప్రజల మద్దతుతో ఎమ్మెల్యేగా ఎన్నికై సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దడానికి మరో అవకాశమివ్వాలని డిప్యూటీ స్పీకర్‌, వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. శనివారం పెద్ద మార్కెట్‌ ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మార్కెట్లో ఉన్న వర్తకులు, పళ్ళు, కూరగాయల అమ్మకం దారులను కలుసుకొని తనకు మద్దతుగా ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా కోలగట్ల మాట్లాడుతూ నగరంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టానని అన్నారు. పార్కులను సుందరీకరించామని, రహదారులు విస్తరించి సౌకర్యవంతంగా తీర్చిదిద్దామని, ప్రధాన జంక్షన్లను అభివృద్ధి చేశామని, నగర సుందరీకరణకు అధిక ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు. మరోసారి ఎమ్మెల్యేగా అవకాశాన్నిస్తే సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. చేసేది ఏమీలేక, చెప్పేది చేయలేక టిడిపి నాయకులు తనపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ గుజ్జుల నారాయణరావు, ఎంకెబి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

➡️