అల్లర్ల అణచివేతపై పోలీసుల మాబ్‌ ఆపరేషన్‌

May 21,2024 23:33

మాక్‌ డ్రిల్‌ చేస్తున్న పోలీసులు
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :
ప్రజలను రెచ్చగొట్టి, అల్లర్లు సృష్టించి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అరాచక శక్తులను పోలీసులు ఎలా ఎదుర్కొంటారో మాక్‌ డ్రిల్‌ ద్వారా పల్నాడు జిల్లా పోలీసులు ప్రజలకు వివరించారు. 4న ఓట్ల లెక్కింపు నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు చేపడుతున్న చర్యలపై ఎఆర్‌ అడిషనల్‌ ఎస్పీ రామచంద్రరాజు ఆధ్వర్యంలో ఆర్మ్‌డ్‌ రిజర్వు పోలీస్‌ సిబ్బందితో పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణంలోని పల్నాడు బస్టాండ్‌ వద్ద మంగళవారం ‘మాబ్‌ ఆపరేషన్‌’ మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. ఎఎస్పీ ఆర్‌.రాఘవేంద్ర మాట్లాడుతూ ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినా, హింసాత్మక చర్యలకు పాల్పడినా, ఎవరైనా అల్లర్లు చేస్తున్న సమయాల్లో స్పందించాల్సిన తీరును వివరించారు. జన సమూహాలను చెదరగొట్టేందుకు మొదటి హెచ్చరిక చేయడం, అప్పటికీ అదుపుకాకుంటే మెజిస్ట్రేట్‌ అనుమతితో టియర్‌ గ్యాస్‌ ప్రయోగించటం, ఉద్రిక్త పరిస్థితుల్లో తనను తాను రక్షించుకుంటూ లాఠీఛార్జి, ఆ తర్వాత ఫైర్‌ డిపార్ట్మెంట్‌ వారితో వాటర్‌ కెనాన్‌ ప్రయోగించటం, ప్లాస్టిక్‌ పెల్లెట్స్‌ ఫైరింగ్‌, అప్పటికి పరిస్థితి అదుపులోకి రాకుంటే ఫైరింగ్‌ వంటి కార్యక్రమాలపై డెమో ద్వారా ప్రదర్శించారు. శాంతిభద్ర తలకు విఘాతం కల్గిస్తూ విధ్వంసానికి ప్రయత్నించే అల్లరిమూకలను అణచి వేసేందుకు, అత్యవసర సమయంలో పరిస్థితిని అదుపులోకి తీసుకొని వచ్చేలా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని చెప్పారు. జిల్లాలో ఎక్కువ సంఖ్యలో కేంద్ర సాయుధ బలగాలు, ప్రత్యేకంగా రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌లు అందుబాటులో వున్నా యన్నారు. ప్రశాంత వాతావరణం నెలకొ ల్పడంతోపాటు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపట్ల చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యకమ్రంలో టూటౌన్‌ సీఐ భాస్కర్‌, ఆర్‌ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️